హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్రయల్స్‌పై నిషేధం

26 May, 2020 08:45 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సోమవారం కీలక ప్రకటన చేసింది. కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రగ్‌ వాడకం వల్ల కోవిడ్‌-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సెట్‌ నివేదిక వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వర్చువల్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వీరికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ను వాడుతున్నారు. (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై యూఎస్‌ హెచ్చరిక)

ఈ నేపథ్యంలో సేఫ్టీ మానిటరింగ్ బోర్డు భద్రతా డాటాను సమీక్షించే వరకు సాలిడారిటీ ట్రయల్స్‌లో కరోనా రోగుల మీద క్లోరోక్విన్‌ డ్రగ్‌ వాడకాన్ని తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు‌ టెడ్రోస్ ప్రకటించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా ఆర్థరైటిస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ ఔషధాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం బ్రెజీల్‌ ఆరోగ్యమంత్రి ఒకరు తేలికపాటి కోవిడ్‌-19 కేసులకు చికిత్స చేయడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు యాంటీ మలేరియా క్లోరోక్విన్‌ను ఉపయోగించాలని సిఫారసు చేశారు. అయితే ఈ రెండు మందుల వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు, ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది.(మలేరియా మందు భేష్‌!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు