అంతర్జాతీయ ప్రయాణాలు.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచనలు

7 Jul, 2020 20:10 IST|Sakshi

జెనీవా: ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనకునే వారు ఖచ్చితంగా మాస్క్‌ ధరించాలని.. తమకు తప్పక సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోరింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియా వంటి దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్తగా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ సూచనలు చేసింది. ‘కరోనా వైరస్‌ ఎక్కడైనా ఉంటుంది.. ప్రతి చోటా ఉంది. ప్రయాణాలు చేయాలనుకునే వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. ప్రజలు దీనిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి’ అని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ కోరారు. ‘కరోనా నియంత్రణ కోసం పలు దేశాలు ఇప్పటికే ఒక సారి లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. కొన్ని దేశాలు మరో సారి లాక్‌డౌన్‌ అమలు గురించి ఆలోచిస్తున్నాయి. ప్రజలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాల గురించి నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు మార్గరెట్‌. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా, హంగ్‌కాంగ్‌ దేశాలు మరో సారి లాక్‌డౌన్‌ విధించాయి. మంగళవారం ఆస్ట్రేలియాలోని రెండవ అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. అత్యవసరమైన వ్యాపారాలకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ సూచనలు చేసింది.(కోవిడ్‌-19 : ఇలా కూడా వ్యాపిస్తుంది!)

అంతేకాక గతంలో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం డబ్ల్యూహెచ్‌ఓ పలు మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడంతో, కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదంటూ పలు సూచనలు చేసింది. అంతేకాక ప్రస్తుతం ప్రయాణం చేయాలనుకునే వారు సామాజిక దూరాన్ని పాటించడమే కాక తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని మార్గరెట్‌ సూచించారు. వీటితో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె‌ కోరారు.

మరిన్ని వార్తలు