గోడను అడ్డుపెట్టి సునామీని ఆపగలరా? 

3 Nov, 2019 08:39 IST|Sakshi

నవంబర్‌ 5 ప్రపంచ సునామీ అవగాహన దినం

సునామీ అంటే...
సముద్రంలో ఒక విస్ఫోటం జరిగితే ఏమవుతుంది? అంతెత్తు నుంచి ఒక పర్వత శిఖరం సముద్రంలోకి ఒరిగిపోతే ఏం జరుగుతుంది? సముద్ర తీర ప్రాంతంలో ఉండే అగ్ని పర్వతాలు హఠాత్తుగా బద్దలైతే ఫలితమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అదే సునామీ. సముద్రపు అలలు నోరు తెరుచుకున్న రాకాసిలా విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను ముంచేయడాన్ని సునామీ అంటారు. 2004లో తొలిసారిగా భారత్‌ సునామీని కళ్ల చూసింది. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంపై కూడా ప్రభావం పడింది. ఇండోనేసియా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం తీవ్రతకి సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపడి క్షణాల్లో మనుషుల్ని మింగేశాయి. సునామీల చుట్టూ నెలకొని ఉన్న వాస్తవాలేంటో ఓ సారి చూద్దాం. 

సునామీ నాలుగు రకాలుగా ముంచుకొస్తుంది. సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు, కొండచరియలు సముద్రంలో విరిగిపడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, ఉల్కాపాతం సంభవించినప్పుడు (ఇది అత్యంత అరుదు) సునామీలు ఏర్పడతాయి. సునామీ అన్న పదం జపనీస్‌ భాషకు చెందింది. హార్బర్‌ కెరటం అని దీని అర్థం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్‌ విమానం స్పీడ్‌తో ఇది సమానం. ప్రపంచంలో జపాన్‌ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది.2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైంది. ఇండోనేసియా కేంద్రంగా సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. ఈ భూకంపంతో సముద్రంలో నింగికెగిసిన మృత్యు కెరటాలు తీర ప్రాంతంలో ఉన్న 11 దేశాలను ముంచేశాయి. 2 లక్షల 83 వేల మందిని రాకాసి అలలు పొట్టన పెట్టుకున్నాయి. 

గోడను అడ్డుపెట్టి సునామీని ఆపగలరా? 
తుపాను ముందు సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ కొన్ని గంటల్లోనే అంతా నాశనమైపోతుంది. సునామీలు అంతే. సునామీ రావడానికి ముందు సముద్రపు ఘోష వినిపించదు. ఎటు చూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. మొదట నెమ్మదిగా ముందుకొచ్చే అలలు క్రమక్రమంగా తీవ్రరూపం దాలుస్తాయి. రాకాసి అలలుగా మారి క్షణాల్లో అంతా ముంచేస్తాయి. జపాన్‌లో ఇలా నిశ్శబ్దంగా భయం పుట్టించే సునామీలు సర్వసాధారణం. సునామీలు సంభవించడంలో ఆ దేశం రికార్డు సృష్టించింది. సునామీ హెచ్చరికలు రాగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జపాన్‌లో పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పిస్తారు. కేవలం సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ నిర్వహణ కోసమే ఆ దేశం 2 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. ఆనకట్ట కట్టకపోతే ఏ నదికి చరిత్ర ఉండదన్న సామెతను జపాన్‌ ప్రభుత్వం ఎలా ఆకళింపు చేసుకుందో ఏమో కానీ, గోడలు కట్టేసి సునామీని ఆపేయాలనుకుంది. జపాన్‌లో రేవు పట్టణమైన అనోయ్‌లో సముద్ర తీరం వెంబడి 4.5 మీటర్ల గోడను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించింది. ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవ నిర్మాణాలు ఎగిరిపోవడం ఎంతసేపు. అదేవిధంగా ఈ సముద్రపు గోడని 1993లో జపాన్‌ని ముంచెత్తిన సునామీ ధ్వంసం చేసింది. అయినా పట్టు వదలని జపనీయులు తీర ప్రాంతాల్లో కాంక్రీట్‌ గోడల్ని కట్టే కార్యక్రమంలోనే ఉన్నారు. ఇక జపాన్‌ తీరప్రాంతమైన టొహోకూలో 2011లో వచ్చిన భూకంపం ఆ తర్వాత వచ్చిన సునామీ ప్రపంచ విపత్తుల చరిత్రలోనే భారీగా ఆర్థిక మూల్యం చెల్లించుకుంది. ఈ సునామీతో 23,200 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. సునామీల కారణంగా జపాన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్లన్నింటినీ మూసివేసింది. 

సునామీ.. పర్యావరణ పాఠాలు 
2004, డిసెంబర్‌ 26. ఆ రోజు బాక్సింగ్‌ డే. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భీకరంగా విరుచుకుపడిన సునామీ 11 దేశాలతో ఆటాడుకుంది. సముద్రానికి 50 కి.మీ. దూరంలో ఉన్న ఊళ్లను ముంచేసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టమే కాదు పర్యావరణానికి కూడా చెప్పలేనంత నష్టం జరిగింది. దాని ప్రభావం నుంచి చాలా దేశాలు ఇంకా కోలుకోలేని దుస్థితి. మంచినీళ్లు ఉప్పగా మారిపోయాయి. భూములు ధ్వంసమయ్యాయి. అడవులు కనుమరుగయ్యాయి. వ్యవసాయ భూములు, మడ అడవులు, పగడపు దిబ్బలు నాశనమయ్యాయి. అన్నింటిని మించి సునామీ ఊళ్లకు ఊళ్లనే నాశనం చేయడంతో ఏర్పడిన శిథిలాలను తొలగించడం అన్ని దేశాలకు శక్తికి మించిన సమస్యగా మారింది. ఈ శిథిలాలను, వ్యర్థాలను పర్యావరణాన్ని కలుషితం చేయకుండా రీ సైక్లింగ్‌ చేయడంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఈ శిథిలాల నుంచి విడుదలయ్యే గ్యాస్, రసాయనాలు వాయు కాలుష్యాన్ని పెంచేశాయి.

ఇక భూములన్నీ ఉప్పుగా మారడంతో సునామీ ప్రభావిత ప్రాంతాల్లో పంటలు పండటమే గగనంగా మారింది. నదులు, సరస్సులు, బావులు, చెరువుల్లో నీళ్లు ఉప్పుగా మారడంతో తాగు నీటి సమస్య కూడా తలెత్తింది. మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేసియాలో చమురు కేంద్రాలు ధ్వంసం కావడం కూడా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ సునామీ వచ్చి 15 ఏళ్లు అవుతున్నా పలు తీర ప్రాంతాల్లో పర్యావరణం సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు సహాయం అందించంపైనే దృష్టి ఉంటుంది. అయితే సునామీ తర్వాత మాత్రం పర్యావరణాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి ఉంచాలన్నది నిపుణుల మాట. ఇందుకోసం బాధితులు, అక్కడ ప్రభుత్వాల్లో అవగాహన పెంచాలి. విపత్తుల నుంచి బయట పడ్డాక పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక సహకారంతో జీవ వైవిధ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు