'పేదరికమంటే మరణ శిక్షే'!

13 Apr, 2016 19:57 IST|Sakshi
'పేదరికమంటే మరణ శిక్షే'!

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ సాండర్స్ ఎవరూ ఊహించని అంశంపై మాట్లాడి ఆలోచింపజేశారు. ఇప్పటి వరకు అధ్యక్ష రేసులో ఉన్న నాయకులంతా టెక్నాలజీ, సాఫ్ట్ వేర్, ఆదాయం, మంచి వసతులు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై మాట్లాడితే ఈయన మాత్రం పేదరికంపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. అసలు ఉపన్యాసమే పేదరికం అనే అంశంతో ప్రారంభించారు. వార్మోనంట్ ప్రాంతానికి సెనేటర్గా ఉన్న బెర్నీ న్యూయార్క్లోని బింగామ్టాన్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పేదరికం అంశాన్ని నొక్కి చెప్పారు.

మధ్యతరగతి వర్గం, వారి అవసరాలకు సంబంధించి ఏ కొంచెం కూడా స్పృషించని ఆయన పేదరికంపైనే విస్తృతంగా మాట్లాడారు. ఒకప్పుడు పేదరికాన్ని సవాలుగా తీసుకొని నాటి అధ్యక్షుడు ప్రాంక్లిన్ రూజ్ వెల్డ్ ఏ విధంగా కృషి చేశారో తాను అలాగే కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల కాలంలో పేదరికంపై ఎన్నో అధ్యయనాలు బయటకు వచ్చాయని, వీటిల్లో పేదల ఆయుష్షు ఎంతో దారుణంగా తగ్గిపోయిందని చెప్పారు. ధనవంతుల జీవితకాల రేటుతో పేదల జీవితకాల రేటును పోలిస్తే చాలా బాధేస్తుందని అన్నారు.

ఇతర మాటల్లో చెప్పాలంటే ఇది ఒక రకంగా వారికి ఒక మరణ శిక్ష అని నొక్కి చెప్పారు. పేదరిక భౌతిక రూపం అనే పదాన్ని ఆయన ఉపయోగిస్తూ.. దీని అర్ధాన్ని చెబుతూ దీని భారిన పడిన వారికి పొద్దున్నే లేచి తన బిడ్డలను ఎలా సంరక్షించుకోవాలో, పెంచి పెద్ద చేసుకోవాలో అనే ఆలోచన ఉంటుందని, వారికి ఏదైనా అయితే ఆస్పత్రి ఎలా తీసుకెళ్లగలం అని ఆలోచిస్తారని అలా ఆలోచించి ఆ వ్యాకులతతో బలహీనంగా తయారవుతారని చెప్పారు. అందుకే వారి జీవిత ప్రమాణస్థాయి పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు