హలో..  నేనండీ.. మీకిష్టమైన గొంగళిపురుగును!! 

29 Sep, 2018 01:43 IST|Sakshi

చీ..యాక్‌.. ఇదేగా మీ ఎక్స్‌ప్రెషన్‌.. గొంగలి పురుగు అంటేనే పరమ అసహ్యం కదా మనకు.. అయితే.. మరి ఈ గొంగలి పురుగు ఎందుకిలా అంటోంది.. మనతో తన గురించి ఏం చెప్పాలనుకుంటోంది.. ఓసారి దాని నోటనే వినేద్దామా.. 

హాయ్‌.. నేనండీ.. గొంగళి పురుగును.. మీరు బయట చూసే గొంగళి పురుగును కాను.. రోబో గొంగళి పురుగును! నన్ను హాంకాంగ్‌కు చెందిన సిటీ యూనివర్సిటీ వాళ్లు తయారు చేశారు. పీడీఎంఎస్‌ అనే ఓ టైపు సిలికాన్‌ పదార్థంతో రూపొందించారు. నా గురించి చెప్పుకోవాలంటే అబ్బో.. చాలానే ఉంది. గొప్పలు కాదు గానీ.. నేను బలంలో భీముడి టైపు. కరెక్టుగా చెప్పాలంటే.. నా బరువుకన్నా 100 రెట్ల బరువును మోయగలను. అంటే.. నా అంత బలముంటే ఓ మనిషి.. ఓ మినీ బస్సును అవలీలగా ఎత్తేయగలడన్నమాట. 

ఇంతకీ నన్ను ఎందుకు తయారుచేశారో చెప్పలేదు కదూ.. మీకోసమే.. అవును.. కేవలం మీ కోసమే.. నేను మీపాలిట చిన్నపాటి డాక్టర్‌నే. మీ కొచ్చే రకరకాల ఆరోగ్య సమస్యలకు నేనే పరిష్కారం చూపుతాను. నా ఈ చిన్ని కాళ్లు ఉన్నాయి చూశారూ.. మీరు నిజంగా వాటికి మొక్కాల్సిందే. ఎందుకంటే.. వీటి సాయంతోనే నేను మీ శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లిపోగలను.. అక్కడ శోధించేసి.. రోగ కారణాన్ని కనిపెట్టడంలో వైద్యులకు సాయం చేయగలను. అంతేనా.. కావాల్సిన మందులను వీటితోనే పట్టుకెళ్లి.. సమస్య ఉన్నచోట వాటిని విడిచిపెట్టి రాగలను. అంటే.. సమస్య ఎక్కడో చికిత్స అక్కడన్నమాట. దీని వల్ల మందు మరింత బాగా పనిచేస్తుందన్న విషయం మీకు తెలిసిందే. మీకెంత లాభమో కదా.. నేను రక్తం, శ్లేష్మం ఇలా ఎందులో నుంచైనా వెళ్లిపోతా.. నా శరీర మందం 0.15 మిల్లీ మీటర్లే.

నన్ను ఎలక్ట్రో మాగ్నటిక్‌ శక్తి ద్వారా వైద్యులు బయట నుంచి నియంత్రిస్తారు. ఇంతేకాదు.. త్వరలో నాకు మరిన్ని అదనపు హంగులూ అమర్చనున్నారట. రకరకాల ఆకారాల్లో కట్‌ చేసి.. వినియోగించేలా నన్ను మార్చనున్నారట. పనిపూర్తయ్యాక.. అక్కడే శరీరంలోనే  కరిగిపోయేలా చేయాలని కూడా యోచిస్తున్నారట. నా టాలెంట్‌ ఏమిటో మీకు తెలియాలంటే ముందుగా మీరు నన్ను మింగాల్సి ఉంటుంది.. లేదంటే.. మీ శరీరాన్ని కోసి.. లోపలికి పంపిస్తారు.. ఏది బెటరో మీ ఇష్టం. వెళ్లేముందు ఒక్క మాట.. 

చూడ్డానికి నేను గొంగలి పురుగునే..  కానీ జబ్బు పడ్డ మీ జీవితాన్ని అందమైన సీతాకోక చిలుకలాగ మార్చగలను.. ఉండనా మరి.. టాటా.. బైబై..  

మరిన్ని వార్తలు