కరోనా: బీఎంఐ ఎక్కువగా ఉంటే కష్టమే!

18 Jun, 2020 15:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైద్య నిపుణుల హెచ్చరికలు

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే కొన్ని దేశాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా అధికంగా ఉండటం శుభపరిణామంగానే చెప్పవచ్చు. ఇక కరోనా పేషెంట్లలో కొంతమంది గంటల వ్యవధిలోనే మృత్యువాత పడుతుండగా.. మరికొంత మంది మాత్రం సులువుగానే మహమ్మారిని జయించి సాధారణ జీవితం గడుపుతున్నారు. వీరిలో కొంతమంది వృద్ధులు కూడా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసాలకు రోగి బ్లడ్‌ గ్రూప్‌ కూడా ఓ కారణమే అంటున్నారు మేరీల్యాండ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌, అమెరికన్ ఫిజీషియన్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌. స్థూలకాయం, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా కరోనా సంక్రమణలో కీలక పాత్ర పోషిస్తాయని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వారికి వెంటిలేటర్‌పై చికిత్స
టైప్‌ ఓ బ్లడ్‌ కలిగిన కోవిడ్‌ పేషెంట్‌తో పోలిస్తే టైప్‌ ఏ బ్లడ్‌ కలిగి ఉన్న పేషెంట్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన అవసరం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ అభిప్రాయపడ్డారు. కరోనా రోగుల రక్తంలో చోటుచేసుకుంటున్న మార్పులను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు.. కృత్రిమ మేధను ఉపయోగించి అభివృద్ధి చేసిన పరికరం ద్వారా ఈ విషయాలు వెల్లడైనట్లు తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న కొంతమంది పేషెంట్ల నమూనాలు సేకరించగా.. దాదాపు వాటన్నింటిలో ఒకే రకమైన 22 ప్రోటీన్లు గుర్తించినట్లు తెలిపారు. కరోనా ప్రభావం అనేది వివిధ వ్యక్తులపై వివిధ రకాలుగా ఉంటుందని.. ముఖ్యంగా హోస్ట్‌ రోగనిరోధక శక్తిపైనే వైరస్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. (కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం)

స్థూలకాయులకు కష్టమే
న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోనే ఎపిడిమాలజిస్టు జెన్నిఫర్‌ లైటర్‌ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన స్థూలకాయులు మరణించే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. బాడీ మాస్‌ ఇండెక్స్(బీఎంఐ)‌ 30 కంటే తక్కువ ఉ‍న్నవాళ్లతో పోలిస్తే.. 30-34 మధ్య ఉన్న వాళ్లపై (సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రమాణాల ప్రకారం) కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇక బీఎంఐ 35 కంటే ఎక్కువ ఉన్నవాళ్లు మరణించే అవకాశం అత్యధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

అదే విధంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ.. సెంటర్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ బేస్డ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ కార్ల్‌ హెనెగన్‌.. 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు కరోనాతో మరణించే అవకాశం తక్కువగా ఉందన్నారు. కరోనా వ్యాపించిన తొలినాళ్ల నుంచి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. అదే విధంగా ఓ వ్యక్తి ఆరోగ్యవంతుడైతే వయసుతో సంబంధం లేకుండా కరోనాను జయించే అవకాశం ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డయాబెటిస్‌ పేషెంట్లు అప్రమత్తంగా ఉండాలని.. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంచుకోకపోయినట్లయితే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. అధిక బరువు ఉన్న దానిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే వైరస్‌ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు