‘వాట్సాప్‌’నే ఎందుకు టార్గెట్‌ చేశారు?

2 Oct, 2018 14:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వాట్సాప్‌....సోషల్‌ మీడియాలోనే ఓ సంచలనం సృష్టించిన ఓ సందేశాల ఆప్‌. ఒక్క భారతదేశంలోనే 25 కోట్లమంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారని చెప్పుకుంటున్న ఈ వాట్సాప్‌ యాజమాన్యం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఒక్క సందేశాలే కాకుండా వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను అతి సులువుగా అతి వేగంగా షేర్‌ చేసుకునే అవకాశం ఉండడంతో అనతికాలంలోనే దీనికి అద్భుత స్పందన లభించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు చోటుచేసుకోవడంతో వాట్సాప్‌ ప్రతిష్ట కాస్త మసకబారింది.

నకిలీ వార్తల వ్యాప్తి కారణంగా జరిగిన మూక హత్యల్లో 29 మంది మరణించడంతో ఇలాంటి నకిలీ వార్తలను, వదంతులను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో కనుగొనడంతోపాటు వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేయడం, ఆ మేరకు వాట్సాప్‌ యాజమాన్యం ఇప్పటికే తన సాఫ్ట్‌వేర్‌లో పలు మార్పులు తీసుకురావడం తెల్సిందే. ఇటు భారత ప్రభుత్వం, అటు భారత సుప్రీంకోర్టు ఒత్తిళ్ల మేరకు వాట్సాప్‌ సృష్టికర్తయిన ‘ఫేస్‌బుక్‌’ యాజమాన్యం గతవారమే ఫిర్యాదులను స్వీకరించి విచారించే అధికారిని కూడా నియమించింది. కంపెనీ తీసుకున్న చర్యలను వివరించడం కోసం కంపెనీ తన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి క్రిస్‌ డేనియల్స్‌ కూడా భారత్‌కు పంపించింది. ఆయన భారత్‌ వచ్చి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ను కలుసుకున్నారు. కంపెనీ తీసుకున్న చర్యల గురించి వివరించారు. కొన్ని సూచనలను స్వీకరించారు.

వాట్సాప్‌ వినియోగదారులు వ్యక్తిగతంగా ఒకేసారి ఐదు మందికి, లేదా ఐదు గ్రూపులకు లేదా వ్యక్తులు, గ్రూపులు కలిసి ఐదుకు మించి సందేశాలు పంపడానికి వీల్లేకుండా వాట్సాప్‌ నియంత్రించింది. అలాగే వాట్సాప్‌లో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా విశ్వసించరాదని, వాటిని అనుమానాస్పదంగానే చూసి నిజా నిజాలను తెలుసుకున్నాకే నమ్మాలని, ఆ తర్వాతనే వాటిని షేర్‌ చేయాలంటూ రేడియోల్లో, టీవీల్లో గత ఆగస్టు నెల నుంచి వాట్సాప్‌ కంపెనీ తెగ ప్రచారం మొదలు పెట్టింది. నకిలీ వార్తల వ్యాప్తికి కారణమైంది ఒక్క ‘వాట్సాప్‌’యే కాదు. ఇతర సోషల్‌ మీడియాలు, వెబ్‌సైట్లు, చివరకు కొన్ని టెలివిజన్‌ ఛానళ్లు కూడా నకిలీ వార్తలను ప్రసారం చేశాయి. అయినా వాటి  మీదగా అంతగా దృష్టి పెట్టని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పుడు మూడో నోటీసును జారీ చేసేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సిద్ధమైనట్లు తెల్సింది. ఏది ఏమైనా సమాచారాన్ని ఎవరు పోస్ట్‌ చేశారో, ఎక్కడి నుంచి పోస్ట్‌ చేశారో తెలుసుకునేవిధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిందేనంటూ ఆ నోటీసులో సంస్థను ఆదేశించే అవకాశం ఉంది.

ఇతర సోషల్‌ మీడియాలను వదిలేసి ఒక్క వాట్సాప్‌నే కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేయడానికి కారణం ఏమిటీ? కేంద్ర ప్రభుత్వం నోటీసు మేరకు కోడ్‌ రూపంలో వెళ్లే సందేశాన్ని ముందుగానే కనుగొని, అది ఎక్కడ ప్రాణం పోసుకుంది? ఎవరు దాన్ని పోస్ట్‌ చేశారు? కనుగొనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాట్సాప్‌ అభివృద్ధి చేస్తుందా? అసలు ఇప్పటికే అలాంటి పరిజ్ఞానం అందుబాటులో ఉందా? ఉంటే ఎందుకు ఉపయోగించడం లేదు? ఈ విషయంలో సాంకేతిక విజ్ఞాన పండితులు ఏమంటున్నారు? సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇంతకు గోప్యత అంటే ఏమిటీ? ఎందుకా గోప్యత ? ఎవరి మధ్య గోప్యత?  గోప్యత అవసరమా, కాదా ? అన్నదే ఇక్కడ చర్చ.

భారత్‌లోనే ఎక్కువ యూజర్లు
జనాభా ప్రాతిపదికన చూస్తే వాట్సాప్‌ వినియోగంలో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ భారత్‌. భారత్‌లో తమకు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారని వాట్సాప్‌ చెప్పుకోవడం కాస్త అతిశయోక్తే కావచ్చు. కానీ గత రెండేళ్లలో రిలయెన్స్‌ జియో సృష్టించిన విప్లవం, తక్కువ ధరకు డేటా అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ ఫోన్లు విస్తరించడం తదితర కారణాల వల్ల వాట్సాప్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. వాట్సాప్‌ అంటే ఒకరి నుంచి మరొకరికి సందేశాన్ని పంపుకునే సర్వీసు మాత్రమే కాదు. ఒకేసారి 256 మందిని కలిపి ఓ గ్రూపును ఏర్పాటు చేయవచ్చు. మనం పంపించే సందేశం క్షణాల్లో గ్రూపులోని 256 మందికి ఒకేసారి వెళుతుంది. 256 మందిలో కూడా ప్రతి ఒక్కరికి కనీసం పది మందితో కూడిన గ్రూపులు ఉన్నాయనుకుంటే ఆ గ్రూపులన్నీ కూడా సందేశాన్ని లేదా సమాచారాన్ని షేర్‌ చేసుకుంటే కొన్ని క్షణాల్లో వేలాది మందికి సమాచారం వెళుతుంది. ఇంత వేగంతో ఇంత మందికి ఇంత సులువుగా సమాచారాన్ని, వీడియోలను, డాక్యుమెంట్లను షేర్‌ చేసే యాప్‌ మరోటి లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌పై దృష్టిని కేంద్రీకరించింది. అయితే భారత్‌లో 25 శాతం మంది యూజర్లు ఏ గ్రూపుల్లోను లేనివారేనని కంపెనీ చెబుతోంది. అంటే 75 శాతం మంది గ్రూపుల్లో ఉన్నారన్న మాటే కద!

వార్తాపత్రికలకు నియంత్రణా వ్యవస్థ
‘వార్తా పత్రికలు, రేడియోలు, టీవీ ఛానళ్లు చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి నియంత్రణకు వ్యవస్థనే ఉంది. వాటిల్లో వచ్చే నకిలీ వార్తలకు వాటి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాట్సాప్‌ సామాజిక సందేశ సర్వీస్‌ ప్రొఫైడర్‌ అవడం వల్ల దానిపై ఆ నియంత్రణ లేదు’ అని నల్సర్‌ లా యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ టీ. ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కడి నుంచి ఎవరు అప్‌లోడ్‌ చేశారో తెలుసుకోవాలని ఇప్పుడు ప్రభుత్వం వాంఛిస్తోంది. వాట్సాప్‌ ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌’ వ్యవస్థ. అంటే ఒక యూజర్‌ నుంచి మరో యూజర్‌ వద్దకు సందేశం కోడ్‌ రూపంలోనే వెళుతోంది. మధ్యలో దాన్ని డీకోడ్‌ చేసే వ్యవస్థ లేదు. అందువల్ల యూజర్‌ పంపిన సందేశం వాట్సాప్‌ యాజమాన్యానికి తెలిసే అవకాశమే లేదు. అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఆ కంపెనీకి ఇంతవరకు లేదు.

గోప్యత కారణంగానే మాకు ఆదరణ
‘సున్నితమైన కుటుంబ వ్యవహారాలు, వైద్యానికి సంబంధించిన అంశాలు, బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుందన్న నమ్మకంతోనే ఎంతో మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఆ సమాచారిన్ని పంపిందెవరో కనుగొనే వ్యవస్థ ఉండాలంటే వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. అలా జరిగితే అందుకు సంబంధించి కంపెనీ అంతర్జాతీయంగా పలు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని కంపెనీ అధికార ప్రతినిథి ఒకరు తెలిపారు.

బలిపశువును చేయడం భావ్యం కాదు
‘నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు జరుగుతున్నాయంటూ వాట్సాప్‌ లాంటి యాప్‌లను బలి పశువులను చేయడం ప్రభుత్వాలకు ఎంత మాత్రం భావ్యం కాదు. ఇది తమ బాధ్యతలను ఇతరులపై రుద్దడం లాంటిదే. ప్రజలకు సరైన భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసు వ్యవస్థది. నకిలీ వార్తల పేరిట సందేశాహరులెవరో తెలుసుకోవాలనుకోవడం వ్యక్తిగత స్పేస్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించడమే’ అని సాంకేతిక వ్యాసాల వ్యాసకర్త, న్యాయవాది అపర్‌ గుప్తా అభిప్రాయపడ్డారు.

ఇది బాధ్యతల నుంచి తప్పించుకోవడమే
‘సందేశాన్ని డీకోడ్‌ చేసే సాంకేతిక పరిజ్ఞానమే తమకు లేదని, యూజర్ల గోప్యతను పరిరక్షించేందుకే తాము అటు వైపు ఆలోచించలేదని వాట్సాప్‌ యాజమాన్యం వాదించడం అర్ధరహితం. యూజర్ల సమాచారాన్ని పర్యవేక్షించాలంటే అదనపు ఉద్యోగులు అవసరం. తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ లాభాలను పొందాలన్నది ఆ కంపెనీ లోలోపలి ఆలోచన. వాట్సాప్‌.... ఫేస్‌బుక్, ట్విట్టర్‌ లాంటిది కాదు. ఇది చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. డీకోడ్‌చేసే సాంకేతిక పరిజ్ఞానం లేదని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. పత్రికలు, టీవీలు, రేడియోలు చట్టం పరిధిలోకి వచ్చినట్లే వాట్సాప్‌ను కూడా చట్టం పరిధిలోకి తీసుకరావాల్సిందే’ అని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రశాంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గోప్యత ఇద్దరు వ్యక్తులు, ఓ కుటుంబానికి సంబంధించినదని, వారు గోప్యంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఇతర మార్గాలున్నాయన్నది ఆయన అభిప్రాయం.

మధ్యేమార్గమే ఉత్తమం
ముఖాముఖి ఛాటింగ్, వ్యక్తిగత సందేశాల జోలికి వెళ్లకుండా మూకుమ్మడి సందేశాలను మాత్రమే కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందని ‘మీడియా నామా’కు చెందిన నిఖిల్‌ పవ్‌వా అభిప్రాయపడ్డారు. కోడ్‌ భాషను బ్రేక్‌ చేయకుండా సమాజానికి హానికలిగించే సమాచారాన్ని ఎవరు పంపించారో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిందేనని వాట్సాప్‌కు పోటీగా ‘వియ్‌చాట్‌’కు పనిచేసి ఇప్పుడు ‘ఫిన్‌టెక్‌ స్టార్టప్‌’కు అధిపతిగా ఉన్న హిమాన్షు గుప్తా, ఇలినాయీ యూనివర్శిటీలోకి మీడియా కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హర్ష్‌ తనేజా అభిప్రాయపడ్డారు.


 

మరిన్ని వార్తలు