తులిప్ ప్యాంట్స్ అంటే ఎందుకంత అక్కసు?

13 Jun, 2016 18:03 IST|Sakshi
తులిప్ ప్యాంట్స్ అంటే ఎందుకంత అక్కసు?

ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తులిప్ ప్యాంట్లు పాకిస్తాన్ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. ఈ సరికొత్త ఫ్యాషన్ దావానలంలా దేశమంతా వ్యాపించడంతో పాక్ ఆడవాళ్లు వాటిని ఎగబడి కొంటున్నారు. దీనిపై తమ సోషల్ మీడియా మాత్రం ప్రతికూలంగా స్పందించడం పట్ల అక్కడి ఫ్యాషన్ డిజైనర్లు మండిపడుతున్నారు. వారికి ఎందుకు నచ్చడం లేదో తమకు అర్థం కావడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తులిప్ ప్యాంట్స్ లేదా తులిప్ సల్వార్లు భారత్లోని ఆడవాళ్ల ధోవతికి నకలని కొంతమంది విమర్శించగా, ఇవి తమకు అసలు నచ్చలేదని, బెల్ బాటమ్ స్టైల్‌ను మళ్లీ ప్రోత్సహించడమేనని, దీనికి బదులు సిగరెట్ ప్యాంట్లను ప్రోత్సహించడమే బెటరని, ఇది ఫ్యాషన్ ప్రపంచం విధ్వంసానికే దారితీస్తుందంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

'అవును, భారతదేశంలో ఆడవాళ్లు ధరించే ధోవతి నుంచే ఈ తులిప్ సల్వార్లు పుట్టుకొచ్చాయి. దాన్ని ఆధునీకరించి ఆడవాళ్లకు మరింత అనువుగా వీటిని డిజైన్ చేశారు. ఎంతోమంది ఆడవాళ్లకు ఇవి నచ్చుతుండగా మధ్యలో మీకెందుకు అభ్యంతరం. ఆడవాళ్లకు ఏవీ వేసుకుంటే అనువుగా ఉంటాయో వారికి బాగా తెలుసు' అని లాహోర్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్, బ్లాగర్ అబీరా జుహాయిబ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని, అలాంటి వాతావరణానికి ఇలాంటి సల్వార్లు ఎంతో మేలైనవని ఫ్యాషన్ పత్రిక 'ఎక్స్‌పోజ్ మ్యాగజైన్' చీఫ్ ఎడిటర్ అంద్లీప్ రాణా ఫర్హాన్ వ్యాఖ్యానించారు. సిల్క్‌ తో పాటు కాటన్‌లో కూడా ఈ తులిప్ సల్వార్లు లభిస్తున్నాయని అన్నారు.

పైన సల్వార్‌లా వదులుగా ఉంటూ, చివరి భాగంలో న్యారోగా ఉండే తులిప్ ప్యాంట్లకు ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ మహిళలు వీటి వెంట పడుతున్నారు. పైన సల్వార్ కమీజ్‌లే కాకుండా, వదులైన షర్టులు, టైట్ షర్టులు, పొడవైన లేదా పొట్టి చొక్కాలు ధరించినా నప్పే డిజైన్ అవడంతో వీటిని పాక్ మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు