మళ్లీ జపాన్‌ మీదుగా మిస్సైల్‌

16 Sep, 2017 07:48 IST|Sakshi
మళ్లీ జపాన్‌ మీదుగా మిస్సైల్‌

► ఆంక్షలను పట్టించుకోని ఉత్తరకొరియా
► భయాందోళనలకు గురైన జపాన్‌వాసులు
► మండిపడిన అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌


సియోల్‌: ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఆంక్షలు విధించినా ఉత్తరకొరియా వెనక్కి తగ్గడం లేదు. జపాన్‌ భూభాగం మీదుగా తాజాగా మరోమారు ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ప్యాంగ్‌యాంగ్‌ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఈ క్షిపణిని ప్రయోగించింది. ఇది జపాన్‌ మీదుగా వెళ్లి పసిఫిక్‌ మహాసముద్రంలో పడింది. మూడు వారాల క్రితం జపాన్‌ భూభాగం మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెలలో మరోమారు అణుపరీక్షలను కూడా నిర్వహించింది.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కొత్తగా ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ తాజాగా క్షిపణి ప్రయోగానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. సుమారు 770 కిలోమీటర్ల ఎత్తులో.. 3,700 కిలోమీటర్లు ప్రయాణించి క్షిపణి సముద్రంలో పడిపోయినట్లు దక్షిణకొరియా రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం నేపథ్యంలో న్యూయార్క్‌లో భద్రతామండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ క్షిపణి వల్ల ఉత్తర అమెరికాకుగానీ, అమెరికా పసిఫిక్‌ టెర్రీటరీ గ్వామ్‌కుగానీ ఎటువంటి ప్రమాదం లేదని అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ వెల్లడించింది.

వణికిన జపాన్‌
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంతో జపాన్‌ ఒక్కసారిగా వణికింది. ఉదయం నిద్ర లేవగానే సైరన్‌ మోతలు.. అత్యవసర సందేశాలతో లక్షలాది మంది జపాన్‌ వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించింది అంటూ లౌడ్‌ స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడంపై జపాన్‌ మండిపడింది. ఇది రెచ్చగొట్టే చర్యని, ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతికి విఘాతమని, వీటిని ఉపేక్షించబోమని జపాన్‌ ప్రధాని షింజో అబే హెచ్చరించారు. ఉత్తరకొరియా ఇదే పద్ధతిలో ముందుకు వెళితే.. దానికి భవిష్యత్తు ఉండబోదని, ఈ విషయం వారికి అర్థమయ్యేలా చేస్తామని చెప్పారు.

మండిపడిన అమెరికా
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరకొరియా మిత్రదేశాలైన చైనా, రష్యా ఇప్పటికైనా ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్షిపణి ప్రయోగాన్ని తాము ఖండిస్తున్నట్టు చైనా, రష్యా ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి ఆంక్షల్ని అమలుచేస్తామని చైనా పేర్కొంది. ఉ.కొరియా చర్యను ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించారు.

మరిన్ని వార్తలు