కరోనా మృతులు న్యూయార్క్‌లోనే ఎందుకు ఎక్కువ?

13 Apr, 2020 11:06 IST|Sakshi

న్యూఢిల్లీ‌: చైనాలో బయటపడ్డ కరోనా వైరస్‌(కోవిడ్‌-19) క్రమక్రమంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై విలయతాండవం చేస్తూ వేలాది మందిని బలితీసుకుంటోంది. అమెరికాలో ఇప్పటికే దాదాపు ఐదున్నర లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 21, 600 మంది మృత్యువాత పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు అక్కడ దాదాపు 6,898 మరణాలు సంభించాయి. మృతదేహాలను పూడ్చేందుకు సరిపడా స్థలం లేక వేర్వేరు బాక్సుల్లో పెట్టి సామూహిక ఖననం చేస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే న్యూయార్క్‌లో పరిస్థితి ఇంతలా దిగజారడానికి గల ముఖ్య కారణాలు పరిశీలిద్దాం.

జన సాంద్రత
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ జనాభా దాదాపు 86 లక్షలు. అంటే చదరపు కిలోమీటరుకు సగటున 10 వేల మంది నివసిస్తున్నారు. అమెరికాలోని ఇతర పట్టణాలతో పోలిస్తే ఒక్కడే జన సాంద్రత ఎక్కువని ఈ గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక రాజధాని కాబట్టి రాకపోకలు కూడా ఎక్కువగానే సాగుతాయి. జన సమ్మర్ధంతో సబ్‌వేలు కిటకిటలాడుతూ ఉంటాయి. కాబట్టి భౌతిక దూరం పాటించే అవకాశాలు చాలా తక్కువ. ఇవన్నీ వెరసి అంటువ్యాధి కరోనా వేగంగా విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.(కరోనా: ఇటలీని దాటేసిన అగ్రరాజ్యం)

పర్యాటకం
బిగ్‌ ఆపిల్‌గా పేరొందిన న్యూయార్క్‌ సిటీ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షయణీయ నగరంగా గుర్తింపు పొందింది. ఇక స్మార్ట్‌సిటీకి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికి సగటున దాదాపు 60 లక్షల మంది న్యూయార్క్‌ను సందర్శిస్తున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ గతేడాది డిసెంబరులో బయటపడినప్పటికీ అప్పటికీ ప్రపంచానికి దీని ఉనికి గురించి తెలియదు. ఈ మహమ్మారిని తీవ్రంగా పరిగణించే నాటికే కావాల్సినంత నష్టం జరిగిపోయింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించే నాటికే న్యూయార్క్‌లో విదేశీయుల ద్వారా గానీ, విదేశాల నుంచి వచ్చిన స్వదేశీయుల నుంచి గానీ కరోనా విస్తరించి ఉండవచ్చు. ఈ క్రమంలోనే మార్చి 1న న్యూయార్క్‌లో తొలి కరోనా కేసు నమోదైంది.(ఆ దేశాల్లో కుయ్యో మొర్రో అంటున్న కరోనా!)

పేదరికం..
ఆర్థిక రాజధానిగా ఉన్నప్పటికీ వివిధ సామాజిక- ఆర్థిక అసమానతలకు బిగ్‌ ఆపిల్‌ నిలయం. ముఖ్యంగా బ్రాంక్స్‌, క్వీన్స్‌లో అనేక మంది రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి వైద్య సదుపాయాలు అందిపుచ్చుకునే ఆర్థిక స్థోమత లేదు. దీంతో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మరణాల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరంగా పరిణమించింది.

విశ్లేషకుల అంచనా ప్రకారం న్యూయార్క్‌లో కరోనా మరణాలు పెరగడానికి ఈ మూడే ముఖ్య కారణాలు. ఇక ప్రపంచ జనాభాలో కేవలం 4.25 శాతం జనాభా కలిగి ఉన్న అమెరికాలో వేలాది మంది మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మరణించిన ప్రతీ ఐదుగురిలో ఒకరు అగ్రరాజ్యానికే చెందిన పౌరుడు ఉండటం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు