పాక్ ఉగ్రవాదుల వ్యూహం ఎందుకు మారింది?

7 Oct, 2016 14:30 IST|Sakshi
పాక్ ఉగ్రవాదుల వ్యూహం ఎందుకు మారింది?
న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 2008లో ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడి సందర్భంగా భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయంలో పాక్ భూభాగంలో జరిపిన సర్జికల్ దాడుల సందర్భంగా మళ్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి సంఘటనకు, నేటి సంఘటనకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఉగ్రవాదుల  వ్యూహం కూడా మారింది. 
 
ముంబై దాడుల వరకు పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జరపగా, ఆ తర్వాత నుంచి భారత సైనిక దళాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నారు. ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 19 మంది సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు మూడు నెలల ముందు పాంపోర్ సమీపంలోని సీఆర్‌పీఎఫ్ శిబిరంపై జరిగిన దాడిలో 8 మంది సైనికులు మరణించారు. గతేడాది డిసెంబర్‌లో సైనిక 31వ రిజిమెంట్ ఆర్డినెన్స్ క్యాంప్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సహా 8 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు మరణించారు. ఉగ్రవాదులు ఎందుకు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు?
 
2008లో జరిగిన ముంబై దాడులతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చింది. పాక్ ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని మార్చుకొని ఉంటారని రక్షణ శాఖ నిపుణులు మనోజ్ జోషి తెలిపారు. సైనిక, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపితే అది అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదులు దాడుల కిందకు రాదని, కశ్మీర్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న మిలిటెంట్ల దాడుల కిందకు వస్తుందని పాకిస్థాన్ భావించి ఉంటుందని ఆయన అన్నారు. నాటి నుంచి నేటి వరకు పౌరులపై దాడులు 93 శాతం తగ్గి, అదే స్థాయిలో సాయుధ బలగాలపై ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. 
 
మరిన్ని వార్తలు