ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ ఉద్వాసనకు కారణం ఏమిటి?

12 May, 2017 07:07 IST|Sakshi
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ ఉద్వాసనకు కారణం ఏమిటి?

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి రష్యా నిర్వహించిన పాత్రపై ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ దర్యాప్తు చేస్తున్న తీరు నచ్చకపోవడం వల్లే అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయనకు ఉద్వాసన పలికారని స్పష్టమౌతోంది. ఈ దర్యాప్తునకు చెప్పుకోదగ్గ మొత్తంలో నిధులు, సిబ్బందిని కేటాయించాలని ఫెడరల్‌ న్యాయశాఖను తన తొలగింపునకు కొద్ది రోజుల ముందు కోమీ కోరారని అమెరికా మీడియా వెల్లడించింది. మెజారిటీ పాలకపక్షమైన రిపబ్లికన్‌పార్టీ సభ్యలతో నిండిన సెనేట్, హౌస్‌ కమిటీలు కూడా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నప్పటికీ, ఎఫ్‌బీఐ తన దృష్టిని ట్రంప్‌ టీమ్‌తో రష్యాకున్న లింకులపై కేంద్రీకరించడం అధ్యక్షుని ఆగ్రహానికి కారణమైంది.

ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై సాగుతున్న దర్యాప్తును తాను పర్యవేక్షిస్తున్నానని మార్చిలో కోమీ ధ్రువీకరించాక ఆయనను తొలగించడంతో ట్రంప్‌కు ఈ దర్యాపును సక్రమంగా ముగించడం ఇష్టంలేదని తేలిపోయింది. మార్చి 20న హౌస్‌ ఇంటెలిజన్స్‌ కమిటీ ముందు హాజరైన కోమీ, ‘‘ఎఫ్‌బీఐ రష్యా జోక్యంపైనేగాక, ట్రంప్‌ ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయిందా? అనే విషయంపై కూడా దర్యాప్తు జరుపుతోంది’’అని చెప్పిన మాటలు కోమీకి ఉద్వాసన పలకాల్సిందేనని అధ్యక్షుడు నిర్ణయించుకోవడానికి కారణమయ్యాయి. ఎన్నికల సమయంలో ట్రంప్‌ టవర్‌ ఫోన్లను ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా ట్యాపింగ్‌ చేయించారనడానికి సాక్ష్యాధారాలు లేవని కూడా అదే సందర్భంలో కోమీ అన్న మాటలు ట్రంప్‌కు చిర్రెత్తించాయి. అయితే, రష్యాతో తన శిబిరానికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయడం వల్లే కోమీని తొలగించారనే మాటకు విలువలేకుండా చేయడానికే ట్రంప్, ‘‘నాపై దర్యాప్తు జరపడం లేదని మూడు వేర్వేరు సందర్భాల్లో మీరు నాకు చెప్పడం ఎంతో అభినందనీయం.’’ అని కామీని ప్రశంసిస్తూనే పదవి నుంచి తొలగించారు.

ట్రంప్‌పై మెకెయిన్‌ నిప్పులు
ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై ప్రత్యేక కాంగ్రెషెనల్‌ కమిటీతో దర్యాప్తు జరిపించాలని తానెప్పటి నుంచో కోరానని, ఇలాంటి కమిటీని తక్షణమే నియమించాల్సిన అవసరం ఉందని ఎఫ్‌బీఐ ఛీఫ్‌ తొలగింపు నిరూపిస్తోందని రిపబ్లికన్‌ సీనియర్‌ సెనేటర్‌ జాన్‌ మెకెయిన్‌ చెప్పారు. అయితే, ఏడాదిగా రష్యా పాత్రపై కాంగ్రెస్‌ విచారణ సాగుతోందనీ, ముందుకు సాగని ఈ దర్యాప్తునకు వెంటనే స్వస్తి పలికితే మంచిదని, అమెరికన్లు కోరుకుంటున్న విషయాలపై ఇక దృష్టి పెట్టడం మంచిదని వైట్‌హౌస్‌ ప్రతినిధి సారా హకబీ శాండర్స్‌ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ చెప్పిన మాటల్లో నిజం లేదు. ఎందుకుంటే, ఇంతవరకూ ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ దర్యాప్తు ప్రారంభమే కాలేదు. రెండోది, రష్యా జోక్యంపై అత్యధిక ప్రజానీకం విచారణ జరపాలని కోరుతోంది. మరో ముఖ్యాంశం ఏమంటే, రష్యన్ల జోక్యంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ఇటీవల జోరందుకుంది. ఈ కుంభకోణంపై కోమీ ఇటీవల రోజూవారీగా నివేదికలు అందకుంటున్నారు. అంతకు ముందు వీక్లీ రిపోర్టులు ఆయనకు వచ్చేవి. ఈ పరిస్థితులే ట్రంప్‌ ఆగ్రహానికి, చివరికి కోమీ ఉద్వాసనకు దారితీశాయని అమెరికా ప్రధాన మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

వాటర్‌గేట్‌ ఛాయలు
రష్యాపాత్రపై దర్యాప్తుపై కొత్త డైరెక్టర్‌ పర్యవేక్షణ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ జవాబివ్వకపోవడం కూడా ఈ దర్యాప్తును నీరుగార్చుతారనే అనుమానాన్ని బలపరుస్తోంది. 1972 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలోని వాటర్‌గేట్‌ కాంప్లెక్స్‌–హోటల్‌లో జరిగిన డెమొక్రాటిక్‌ కన్వెన్షన్‌లో ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంపై(వాటర్‌గేట్‌ కుంభకోణం)దర్యాప్తునకు 1973లో ఓ ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమించారు. ఆయన విచారణ ప్రారంభించిన వెంటనే ఆరోపణలెదుర్కొంటున్న అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రాసిక్యూటర్‌ను తొలగించేశారు. దాంతో 1974లో నిక్సన్‌ రాజీనామాకు దారితీసిన పరిణామాలకు ప్రాసిక్యూటర్‌ ఉద్వాసన నాందీ పలికింది. ఇప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ తొలగింపు 1973నాటి పరిణామాలను గుర్తుచేస్తోంది.
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు