భారత్‌-ఇరాన్‌ ప్రతిష్టాత్మక డీల్‌పై అమెరికా గుస్సా!

25 May, 2016 16:56 IST|Sakshi
భారత్‌-ఇరాన్‌ ప్రతిష్టాత్మక డీల్‌పై అమెరికా గుస్సా!

వాణిజ్య సహకారం కోసం దక్షిణ ఇరాన్‌లో చాబహర్‌ ఓడరేవు నిర్మాణం కోసం భారత్‌ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా సెనేటర్లు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇరాన్‌పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి మరీ భారత్‌ ఈ ఒప్పందం చేసుకుందా? అంటూ సెనేటర్లు ప్రశ్నించారు. దీంతో స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ ఈ ఒప్పందాన్ని నిశిత దృష్టితో పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇరాన్‌పై ఆంక్షలకు అనుగుణంగా భారత్‌ వ్యవహరిస్తుందని తాము భావిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ (మధ్య, దక్షిణాసియా వ్యవహారాలు) నిషా దేశాయ్‌ బిస్వాల్‌ తెలిపారు.

ఇరాన్‌లో చాబాహర్‌ ఓడరేవు అభివృద్ధికి  ఆ దేశ ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చైనాను అధిగమించి ఈ ఓడరేవు నిర్మాణాన్ని భారత్‌ చేజిక్కించుకోవడం ద్వైపాక్షికంగా భారత్‌-ఇరాన్‌కు ఎంతో కలిసిరానుంది. ఈ ఓడరేవు వల్ల పాకిస్థాన్‌, చైనాతో నిమిత్తం లేకుండానే భారత్‌ దక్షిణాసియా దేశాలతో వాణిజ్యం కొనసాగించగలదు. వ్యూహాత్మకంగా కీలకమైన చాబాహర్‌ పోర్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోవడం భారత్‌ దౌత్య విజయంగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు