రోబోలతో పరిపాలన అందిస్తాం.. 

15 Apr, 2018 02:02 IST|Sakshi

అది జపాన్‌లోని టామా అనే పట్టణం.. టోక్యో జిల్లాలో ఉంది.. ఇటీవలే అక్కడ మేయర్‌ స్థానం కోసం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. అంటే ఎన్నికల పండుగ మొదలైంది. ఆ స్థానం కోసం చాలా మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. వారి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. అయితే మిచిటో మస్తుడా అనే ఓ అభ్యర్థి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో హామీలు ఇస్తున్నాడు.. అతడు ఇస్తున్న హామీ ఏంటో తెలుసా.. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని.. అందులో కొత్తేం ఉందనుకుంటున్నారా..? కృత్రిమ మేధస్సుతో పరిపాలన చేస్తానని చెబుతున్నాడు.. అంటే పరిపాలన మొత్తం రోబోలతో చేసేస్తానని హామీ ఇచ్చేస్తున్నాడు.. ఒకవేళ మనోడు గెలిస్తే కృత్రిమ మేధస్సుతో పనిచేసే మొట్టమొదటి మేయర్‌ అవుతాడు.

తాను గెలిస్తే ప్రభుత్వ పరిపాలన, విధానాల రూపకల్పన, పథకాలు, వాటి అమలు ఇవన్నీ కృత్రిమ మేధస్సుతో నడుపుతానని మస్తుడా చెబుతున్నాడు. దీంతో నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవచ్చని, తద్వారా ప్రజలకు త్వరితగతిన సేవలందించవచ్చని ప్రచారం చేసుకుంటున్నాడు. దాదాపు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి కృత్రిమ మేధతో నడిచే వాటినే నియమిస్తానని చెబుతున్నాడు. దీంతో అవినీతి, లంచం అనే మాట తన పరిపాలనలో ఉండదని అంటున్నాడు. 2014లో టామా నుంచే మేయర్‌ కోసం పోటీ చేసి డిపాజిట్‌ కోల్పోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని ఈ కొత్త పంథా ఎంచుకున్నాడు. అయితే ఇదంతా ఓ రాజకీయ ఎత్తుగడ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 15) జరుగుతున్న ఈ ఎన్నికల్లో మస్తుడా గెలిస్తే తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.   

మరిన్ని వార్తలు