హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు

2 Jul, 2020 13:22 IST|Sakshi
జో బిడెన్ (ఫైల్ ఫోటో)

వాషింగ్టన్: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే హెచ్1 బీ వీసాలపై  ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తానని ప్రకటించారు. అధ్యక్ష పదవిలో మొదటి 100 రోజుల పరిపాలనలో చేపట్టబోయే కీలక చర్యలపై ప్రశ్నించినపుడు బిడెన్  ఈ ప్రకటన చేయడం విశేషం.

ఆసియా అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల సమస్యలపై డిజిటల్ టౌన్ హాల్ సమావేశంలో బిడెన్ ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఈ దేశాన్ని నిర్మించారంటూ హెచ్1 బీ వీసాదారుల సేవలను ఆయన ప్రశంసించారు. ఈ నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే, మొదటి రోజే ఈ దేశానికి ఎంతో సహకారం అందించే 11 మిలియన్ల మంది వలసదారుల పౌరసత్వానికి సంబంధించి కాంగ్రెస్‌కు ఇమ్మిగ్రేషన్ సంస్కరణల రోడ్‌మ్యాప్ బిల్లును పంపబోతున్నానన్నారు. తమ ఇమ్మిగ్రేషన్ విధానం వైవిధ్యంగా ఉండబోతోందని వివరించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవనీ, క్రూరమైనవని ఆయన ఆరోపించారు. 

కాగా కరోనా వైరస్, దేశంలో ఆర్థిక మాంద్యం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం రేటు కారణాల రీత్యా, హెచ్1 బీ వీసా జారీ ప్రక్రియను ‘సంస్కరించే యత్నం’లో భాగంగా హెచ్ 1 బీ సహా, ఇతర వర్క్ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల 23న ప్రకటించారు. హెచ్1 బీ, హెచ్ 4, హెచ్ 2 బీ వీసా, జె అండ్ ఎల్ వీసాలతో బాటు పలు నాన్-ఇమ్మిగ్రేషన్ వీసాలను ఈ ఏడాది ఆఖరువరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు