ఆత్మరక్షణ కోసమే మా అణ్వాయుధాలు

24 Sep, 2016 12:05 IST|Sakshi
ఆత్మరక్షణ కోసమే మా అణ్వాయుధాలు

తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తరకొరియా మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే అణ్వాయుధాలున్న దేశాలు ఎంత బెదిరించినా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధిస్తామని తెలిపినా తాము మాత్రం వాటిని వదిలిపెట్టేది లేదని తెలిపింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ హో ఈ విషయం తెలిపారు. తమ దేశంలో ఉన్న అణ్వాయుధాలన్నీ కేవలం ఆత్మరక్షణ కోసమేనని, తమకు అమెరికా నుంచి అణ్వాయుధాల ముప్పు ఉంది కాబట్టే వీటిని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. అణ్వాయుధాలు కలిగి ఉండాలన్నది తమ దేశ విధానమని తెలిపారు. ఇతర దేశాలతో తమ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో జాతీయ భద్రత, కొరియన్ ద్వీపకల్పంలో శాంతి దృష్ట్యా తమకు ఈ ఆయుధాలు ఉండాలన్నారు.

తమ అణ్వాయుధాలను రాశి, వాసి పరంగా మరింత బలోపేతం చేసుకుంటామని కూడా ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో స్పష్టం చేశారు. కొరియన్ ద్వీపకల్పం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని.. ఇక్కడ ఏ క్షణంలోనైనా అణు యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. దక్షిణ కొరియా, అమెరికా కలిసి తరచు పెద్ద ఎత్తున అణ్వాయుధ విన్యాసాలు చేస్తున్నాయని, ఉత్తరకొరియా నాయకత్వాన్ని అస్థిరత పాలుచేయాలని, రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. గత సంవత్సరం తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త శాంతి ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించినా వాళ్లు పట్టించుకోలేదని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు