మీ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చా!

15 Mar, 2015 01:30 IST|Sakshi
మీ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చా!
  • జాఫ్నాలో తమిళులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్య
  • పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని స్పష్టీకరణ
  • తమిళ నిరాశ్రయులకు 27 వేల కొత్త ఇళ్ల అందజేత
  • జాఫ్నా/కొలంబో: దశాబ్దాల అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడి, తమిళుల హక్కుల కోసం నినదించిన జాఫ్నా గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. శ్రీలంకలో చివరిరోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన తమిళుల ప్రాబల్య ప్రాంతమైన జాఫ్నాను సందర్శించారు. పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని, అందరూ ఆత్మగౌరవంతో జీవించాలంటూ పరోక్షంగా తమిళుల ఆకాంక్షను చాటారు. సంక్షుభిత ప్రాంతంలో ఇన్నేళ్లూ కష్టనష్టాల పాలైన వారి కన్నీళ్లు తుడిచేందుకు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

    ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే. 2013లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ జాఫ్నాలో పర్యటించారు. ఆ తర్వాత ఓ అంతర్జాతీయ నేత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఇలావలైలో తమిళులకు 27 వేల కొత్త ఇళ్లను అందజేశారు.  మంగళ హారతులు, మేళతాళాల మధ్య సంప్రదాయ రీతిలో మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. గృహ ప్రవేశంలో భాగంగా పాలు పొంగించే కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొన్నారు.  రెండో దశలో మరో 47 వేల గృహాలు నిర్మిస్తామన్నారు. జాఫ్నాలో రూ.60 కోట్లతో భారత్ నిర్మిస్తున్న సాంస్కృతిక కేంద్రానికీ మోదీ శంకుస్థాపన చేశారు.  

    ‘పర్యటన షెడ్యూల్‌లో లేకపోయినా ఈ నేలకు వందనం చేసేందుకే ఇక్కడకు వచ్చాను. ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. ప్రజలందరూ సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవంతో జీవించాలి. అందుకు దోహదపడేలా శ్రీలంక రాజ్యాంగానికి 13వ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. నేను సహకార సమాఖ్య వ్యవస్థను నమ్ముతాను’ అని అన్నారు. మోదీ వెంట జాఫ్నా సీఎం, తమిళ నేత సీవీ విఘ్నేశ్వరన్ ఉన్నారు. భారత్‌కు  సమీప ప్రాంతమైన జాఫ్నాలోని తలైమన్నార్‌లో రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు.
     
    మహాబోధి వృక్షానికి పూజలు..

    జాఫ్నాకు బయల్దేరే ముందు మోదీ.. ప్రాచీనకాలంలో లంక రాజధాని అయిన అనురాధాపుర పట్టణానికి వెళ్లి మహాబోధి వృక్షం వద్ద పూజలు చేశారు.  లంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన కలిసి ఈ మహాబోధి వృక్షాన్ని సందర్శించిన మోదీ.. అక్కడ అరంగటపాటు గడిపారు. అనంతరం నాగులేశ్వరం ఆలయాన్ని కూడా మోదీ సందర్శించారు.
     
    రాజపక్సతో భేటీ..

    శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో.. మోదీ కొలంబోలోని భారత హైకమిషన్ ఆఫీసులో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి వెనుక భారత్, అమెరికా, యూరప్ దేశాల హస్తం ఉందని ఇటీవల రాజపక్స ఆరోపించడం తెలిసిందే. ప్రధాని గౌరవార్థం భారత హైకమిషన్ ఇచ్చిన విందులోనూ మోదీ పాల్గొని అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. రెండ్రోజుల లంక పర్యటన ముగించుకొన్న మోదీ శనివారం రాత్రి భారత్ బయల్దేరారు. లంక ప్రధాని విక్రమసింఘే కొలంబో విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. 5 రోజుల పర్యటనలో ప్రధాని సీషెల్స్, మారిషస్, లంకలో పర్యటించారు.

మరిన్ని వార్తలు