టచ్‌ ఫీలింగ్‌ లేకుండా బతకడం వేస్ట్‌!

6 Nov, 2019 20:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఎంతో కోల్పోయాను. తిరిగి వాటిని పొందలేనని తెలుసు. నేను ఈ దశలో కూడా ఆనందంగా ఉన్నానంటూ గత ఆరేళ్లుగా నా భార్యను, మిత్రులను మోసం చేస్తూ వచ్చాను. ఎప్పటికైనా కోలుకుంటానని వాగ్దానం చేశాను. ఇక చేయలేను. ఈ బాధను భరించలేను. చేతులు, కాళ్లు, వొల్లంతా కదలనప్పుడు ఎలా బాగుంటాను. కాళ్లు, చేతులు ఆడకపోయినా టచ్‌ ఫీలింగ్‌ (స్పర్శ తెలియక పోవడం) లేక పోవడం అత్యంత బాధాకరమైన విషయం. రానురాను నా లోపల అంతర్గత నొప్పులు మొదలయ్యాయి. కడుపులో, వెన్నులో చెప్పలేనంత బాధ పెరుగుతూ వస్తోంది. ఇంతకాలం అన్నింటికి మందులు వాడుతూ బాధను అణచిపెట్టుకొని, అంతా బాగున్నట్లు మీ అందరి ముందు నటిస్తూ వచ్చాను.

ఇక బాధ తట్టుకోలేక అత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అందుకోసం ఆత్మహత్యను చట్టపరంగా అనుమతిస్తున్న స్విడ్జర్లాండ్‌కు వెళ్లాలనుకున్నాను. అందుకు నా భార్యను ఒప్పించాల్సి ఉంటుంది. బాధ పెట్టాల్సి ఉంటుంది. అందుకని వైద్యాన్ని నిరాకరించడం ఆత్మహత్య కిందకు రాదని ఎక్కడో చదివాను. అందుకని నాకమర్చిన ‘వెంటిలేటర్‌’ తీసేసి వెళ్లి పోతున్నాను. నన్ను క్షమించండి!’ అంటూ 60 ఏళ్ల మైఖేల్‌ బోన్ని మంగళవారం నాడు భార్య, మిత్రులకు ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ పెట్టి లోకం విడిచి వెళ్లి పోయారు.  

సైకిల్‌ రేసిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన మైఖేల్‌ 2013, మార్చి నెలలో సైకిల్‌పై వెళుతుండగా యాక్సిడెంట్‌ అయింది. అందులో ఆయన వెన్నుముకకు దెబ్బ తగిలి, మెడ నుంచి కాళ్ల వేళ్ల వరకు శరీరం చచ్చుపడిపోయింది. అప్పటి నుంచి ఆయన వీల్‌ చెయిర్‌కు అతుక్కుపోయి వెంటిలేటర్‌ మీద బతుకుతున్నారు. ఇంగ్లండ్, కుబ్రియాలోని పెన్రిత్‌ పట్టణానికి చెందిన మైఖేల్, సైక్లిస్ట్‌ అయిన లింజ్‌ను పెళ్లి చేసుకొని జీవితంలో ఆయిగానే బతికారు. ఆయన పోస్టింగ్‌ను చూసి మిత్రులంతా కదిలిపోయారు. ‘రైడ్‌ ఇన్‌ పీస్‌’ అని ఆయనకు చెబుతూ భార్యకు ఘనంగా నివాళులర్పించారు. ‘ధీరోదాత్తుడివైన నీవు మా మధ్యలో లేక పోయినందుకు నిజంగా బాధ పడుతున్నాం. బాధ నుంచి నీవు విముక్తి పొందినందుకు కాస్త సంతప్తి చెందుతున్నాం’ అన్న భావంతో చాలా మంది మిత్రులు స్పందించారు.

మరిన్ని వార్తలు