భార్యకు ప్రేమతో...

31 Jul, 2018 14:59 IST|Sakshi
తొస్యా భర్త లెవాన్‌ మలచిన అద్భుత భూగృహం

యెరెవాన్‌ : భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్ధం షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మించారు. ఆయనంటే మహారాజు.. కాబట్టి ఏమైనా చేయగలరు. మనం సామాన్యులం, అవన్నీ మన వల్ల అయ్యే పనులు కావనుకుంటాం మనలో చాలా మంది. కానీ అర్మెనియా(గతంలో సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉండేది) దేశానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం భార్య కోసం రెండు దశాబ్దాలకు పైగా, ఒంటరిగా శ్రమించి అద్భుతమైన భూగృహాన్ని నిర్మించాడు. ఇప్పుడది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వివరాల ప్రకారం..అర్మెనియా దేశంలోని అరెంజీ గ్రామానికి చెందిన లెవాన్ అరాక్లేయన్, తొస్యా గరిభ్యాన్‌ దంపతులు. ఒక రోజు తొస్యా ఆలుగడ్డలు నిల్వ చేసుకునేందుకు తన కోసం ఒక బేస్‌మెంట్‌ / భూగృహాన్ని నిర్మించాల్సిందిగా తన భర్తను కోరింది. భార్య కోరిక మేరకు చిన్న బేస్‌మెంట్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన లెవాన్ అంతటితో ఆగక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ భూగృహాన్ని నిర్మించాడు. దీని లోపలంతా ఒంపులు తిరిగిన నిర్మాణాలు, గుహలు, సొరంగాలతో నిర్మితమై ఉంది.

ఈ అపురూప కట్టడం గురించి తొస్యా  ‘నేను సరదాగా కోరిన కోరికను ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 23 ఏళ్లపాటు ఏకధాటిగా శ్రమించి, ఒక్కరే ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఆవిష్కరించారు. 1985లో ఈ భూగృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. రోజులో ఆయన 18 గంటలు పనిచేసేవారు. కాసేపు విశ్రమించి వెంటనే ఇక్కడికి వచ్చేవారు’ అని తెలిపారు.

అంతేకాక ఈ నిర్మాణానికి సంబంధించి ఆయన ఎటువంటి ప్లాన్‌ రూపొందించుకోలేదు. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇంత అద్భుతంగా ఎలా చెక్కుతున్నారని అడగ్గా ‘దాని గురించి నాకు ఏం తెలీదు. కానీ తరువాత చేపట్టబోయే నిర్మాణాల గురించి, శిల్పాలు, కళాఖండాల గురించి నాకు కలలో కన్పిస్తుంటుంది. దాన్ని బట్టే వీటన్నింటిని చెక్కగల్గుతున్నాన’ని తెలిపారు.

‘నా భర్త పని ప్రారంభించిన కొత్తలో రాతిని చెక్కడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఎందుకంటే అదంతా నల్ల బసాల్డ్‌ రాయి. కానీ లోతుకు వెళ్లిన కొద్ది మృదువైన టఫ్పా రాయి వచ్చింది. దాంతో రాయిని తొలచడం చాలా తేలికయ్యిందని, అప్పటి నుంచి పని చాలా వేగంగా నడుస్తుందని తెలిపే’వారన్నారు.

‘ఈ భూగృహ నిర్మాణంలో దాదాపు 600 రాళ్లను ఉపయోగించారు. వీటన్నింటిని లెవాన్ కేవలం బకెట్ల ద్వారానే భూమిలోకి తీసుకెళ్లేవారు. ఎవరి సాయం తీసుకోలేద’ని తెలిపారు. ‘ఆ విధంగా 280 చదరపు అడుగుల వైశాల్యం, 21 మీటర్ల లోతు వరకూ తవ్వుతూ వెళ్లాడ’న్నారు.

లెవాన్‌ కుమార్తె అరకస్య ‘నా చిన్నతనంలో నేను మా నాన్నగారిని చూసింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ ఎప్పుడు రాతిని తొలిచే శబ్దం వినిపిస్తూనే ఉండేది. ఇప్పటికి మా నాన్న గారిని గుర్తుకు తెచ్చుకుంటే నాకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆ ఉలి శబ్దం మాత్రమే’ అన్నారు.

ఈ సొరంగం నిర్మాణం పూర్తి కావొస్తున్న సమయంలో అనగా 2008లో తన 67 ఏట లెవాన్‌ మరణించారు. భర్త మరణించిన అనంతరం తొస్యా ఈ భూగృహంతో పాటు, మరో చిన్న మ్యూజియాన్ని కూడా నిర్వహిస్తోంది. దీనిలో తన భర్త భూగృహం నిర్మాణం కోసం వినియోగించిన వస్తువులను ప్రదర్శన కోసం ఉంచింది. ఇప్పుడు ఈ భూగృహాన్ని దర్శించడానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. దీన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు ‘అద్భుమైన ప్రదేశం.. భూమి మీద నెలకొన్న స్వర్గం’గా అభివర్ణిస్తున్నారు.

భార్యకు ప్రేమతో... ఓ హైదరాబాదీ!

మరిన్ని వార్తలు