మనుషుల్ని మింగే కార్పెట్‌ జాతి కొండ చిలువ

29 Jan, 2019 18:30 IST|Sakshi
లెట్రిన్‌ బేసిన్‌లో కార్పెట్‌ పైథాన్‌

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాకు చెందిన 59 ఏళ్ల హెలెన్‌ రిచర్డ్స్‌ ఫేస్‌బుక్‌ సాక్షిగా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఆమె సూచనలు చదివి ఇంతేనా.. అనుకోవండి. తన సూచనలను హెచ్చరికలుగా భావించకపోతే చావు తథ్యం అంటున్నారామే. విషయమేంటో ఆమె మాటల్లోనే.. ‘గత మంగళవారం ఉదయం వాష్‌రూమ్‌కి వెళ్లిన నాకు చావుతప్పి కన్నులొట్టబోయినంత పనైంది. ఎప్పటిలానే నా పనిలో నేనుండగా.. నా వెనక భాగాన్ని ఏదో గట్టిగా గీటింది. దాంతో భయంతో ఎగిరి దుమికాను. లెట్రిన్‌ బేసిన్‌లో కప్ప దాగుంది కావొచ్చు అనుకున్నాను. బద్ధకంతో వాష్‌రూమ్‌లో లైట్‌ కూడా వేసుకోకపోవడంతో.. చీకట్లో ఏమీ కనిపించలేదు. ఏమై ఉంటుందబ్బా.. అని లైట్‌ వేశాను. అంతే.. దిమ్మతిరిగి పోయింది..!  బేసిన్‌లో ఉన్నది కప్ప కాదు. పొడవైన పాము. ఇక అంతే.. నోట మాట రాలేదు. చచ్చాన్రా దేవుడా అనుకున్నాను. ఒక్క నిముషం గడ్డకట్టుకుపోయాను. 

కాస్త ధైర్యం కూడదీసుకుని మరోసారి బేసిన్‌లో కొంచెం పరిశీలనగా చూశాను. మనసుకు కాస్త ఊరట కలిగింది. బేసిన్‌లో నక్కి.. నన్ను కాటు వేసింది విష రహితమైన కొండచిలువ అని గ్రహించాను. అయితే, అది విషం కక్కే కొండ చిలువ కాకపోయినా.. మనుషుల్ని సైతం మింగే కార్పెట్‌ జాతి కొండ చిలువ. నా అదృష్టం కొద్దీ అది చిన్న సైజులో ఉంది. లేదంటే.. దానికి ఆహారమయ్యేదాన్నే..’ అని తన హారిబుల్‌ పైథాన్‌ స్టోరీని చెప్పుకొచ్చారు హెలెన్‌. మొత్తం మీద చిన్న గాయంతో బయటపడ్డానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాగా, చాపెల్‌ హిల్‌లో నివాసముంటున్న హెలెన్‌ పిలుపుతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్స్‌ ఆ కార్పెట్‌ పైథాన్‌ పట్టుకొని అడవిలో వదిలేశారు. హెలెన్‌ తమను సంప్రదించడం.. ఘటనా సమయంలో ఆమె భయాందోళనలన్నింటినీ కలిపి స్నేక్‌ క్యాచర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టు షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయింది. 

మరిన్ని వార్తలు