కేకు తినే పోటీలో పాల్గొని మహిళ మృతి

27 Jan, 2020 17:59 IST|Sakshi

సిడ్నీ : కేకు తినే (ఈటింగ్‌ కేక్‌) పోటీలో పాల్గొని మహిళ మృతి చెందిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియా డే సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని బీచ్ హౌస్ హోటల్‌లో కేకు తినే(ఈటింగ్‌ కేక్‌) పోటీలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన ల్యామింగ్‌టన్ కేకులను ఈ పోటీలో ఉంచారు. ఈ పోటీలో పాల్గొన్న ఓ 60 ఏళ్ల మహిళ ల్యామింగ్‌టన్ కేకులను వెంట వెంటనే తినడానికి ప్రయత్నించింది. కొన్ని కేక్ పీసులను తిన్న వెంటనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హోటల్‌ యాజమాన్యం ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందారని వెల్లడించారు.

మహిళ మృతి పట్ల హోటల్‌ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ఆహ్లాదకరంగా జరుగుతున్న పోటీలో ఇలా మహిళ ప్రాణాలను పోగొట్టుకోవడం తమకు ఎంతో బాధగా ఉందంటూ హోటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  తాము ఫోన్ చేసిన నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్న అంబులెన్స్ సర్వీసుకు హోటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపింది. 

ఆస్ట్రేలియా డే సందర్భంగా  ఆ దేశంలో ప్రతి ఏడాది తిండి పోటీ (ఈటింగ్‌ కాంపిటీషన్‌) నిర్వహిస్తారు. కేకులు లేదా ఇతర ఆహార పదార్థాలను తక్కువ సమయంలో ఎక్కువ తినేవారిని విజేతలుగా ప్రకటిస్తారు. విజేతలకు విలువైన బహుమతులను కూడా అందిస్తారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు