ప్రపంచంలోనే పెద్ద పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా

21 Jan, 2020 11:36 IST|Sakshi

లండన్‌ : యూకేకి చెందిన ఒక మహిళ తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో 8 అడుగులున్న పెద్ద పాముని చూసి షాక్‌కు గురయ్యారు. కాగా సోమవారం ఆమె ఆ ఫోటోలను తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని బిర్కెన్‌హెడ్‌ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మహిళ నివసిస్తున్నారు. అయితే తాను స్నానం చేసేందుకని బాత్‌రూమ్‌ గది డోర్‌ తెరిచి చూడగానే ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బాత్‌టబ్‌ పక్కన ఉన్న సింక్‌హోల్‌ చుట్టూ బో- కన్‌స్ట్రిక్టర్‌ అనే 8 అడుగుల పాము దానిని చుట్టుకొని ఉంది. తర్వాత మెల్లిగా బాత్‌టబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.

బో- కన్‌స్ట్రిక్టర్‌ ప్రపంచంలోనే అతి పెద్ద పాముల జాబితాలో ఒకటి. కాగా ఈ పాములు విషపూరితమైనవి కాకపోవడం విశేషం. అయితే ఈ అనూహ్య పరిణామంతో ఆమె వెంటనే మెర్సీసైడ్‌ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని దానిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో తమ కానిస్టేబుల్‌ ఈస్ట్‌వుడ్‌ను పిలిపించి దానిని బయటకు తీశారు.

'పామును బయటికి తీయడానికి చాలా కష్టపడ్డాం. దానిని తీయడానికి ప్రయత్నిస్తుంటే సింక్‌హోల్‌ను మరింత గట్టిగా చుట్టుకొంది. దాంతో దానికి నీటిని తాగించే ప్రయత్నంలో అది తన పట్టును విడవడంతో దానిని ఒక పెద్ద కంటైనర్‌లో పెట్టి భద్రపరిచినట్లు' కానిస్టేబుల్‌ తెలిపాడు.  అయితే ఈ పాము ఎక్కడినుంచి వచ్చిందనేది అర్థం కావడంలేదు. అయితే ఇదంతా సదరు తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయగా విపరీతమైన కామెంట్స్‌ వచ్చాయి. ' ఆ పాము మా బాత్‌రూమ్‌లో ఉండి ఉంటే నేను ఏడ్చేసిదాన్ని' అంటూ ఒక నెటిజన్‌ స్పందించారు. ' నేను పామును చూసినప్పటి నుంచి నాకు రాత్రిళ్లు కళలోకి వస్తుందని' మరొక నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు