వివాహేతర సంబంధం ఉందని.. దేశ బహిష్కరణ

15 Jun, 2016 18:21 IST|Sakshi
వివాహేతర సంబంధం ఉందని.. దేశ బహిష్కరణ

డచ్ మహిళకు రూ. 53వేల జరిమానా
సంబంధం ఉన్న పురుషుడికి 140 కొరడా దెబ్బలు


వివాహేతర సంబంధం పెట్టుకొందన్న ఆరోపణలు రుజువు కావడంతో డచ్ మహిళకు ఖతార్ కోర్టు రూ. 53వేల జరిమానా, దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఆమె జరిమానా చెల్లించిన వెంటనే దేశం నుంచి పంపేస్తామని కోర్టు అధికారులు తెలిపారు. అయితే.. తాను అత్యాచారానికి గురైనట్లు ఆమె ఆరోపించింది. తనపై మోపిన ఆరోపణలను ఆమె ఖండించింది. సిరియాకు చెందిన ఒమర్ అబ్దుల్లా అల్ హసన్ అనే వ్యక్తికి ఆమెతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కోర్టులో రుజువైంది. దాంతో అతడికి వివాహేతర  సంబంధం పెట్టుకున్నందుకు 100 కొరడా దెబ్బలు, మద్యం తాగినందుకు మరో 40 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. అతడు శిక్ష అనుభవించేందుకు తగినంత ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.

బాధితురాలు ఖతార్ వదిలి వెళ్లేందుకు తమ రాయబార కార్యాలయం ఆమెకు సాయం చేస్తుందని ఖతార్‌లో డచ్ రాయబారి కోర్టు వద్ద మీడియాకు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆమె వెళ్లిపోతారన్నారు. ఇక నెదర్లాండ్స్‌లో ఉంటున్న బాధితురాలి తల్లి కూడా తాను తన కూతురితో మాట్లాడానని, ఆమె విడుదల అవుతున్న విషయం తెలిసి సంతోషించానని అన్నారు. బాధితురాలు ఒక పార్టీకి వెళ్లినపుడు డాన్స్ చేస్తోందని, కాస్త డ్రింక్ తాగిన తర్వాత తనకు డ్రగ్స్ ఎక్కించినట్లు ఆమెకు అర్థమైందని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. మర్నాటి ఉదయం తనకు ఏమాత్రం తెలియని ఒక అపార్టుమెంటులో ఉందని, అప్పుడే తాను అత్యాచారానికి గురైనట్లు ఆమెకు అర్థమైందని అన్నారు.

మరిన్ని వార్తలు