కుక్క కోసం విమానం అద్దెకు..

21 Dec, 2019 12:16 IST|Sakshi

కాలిఫోర్నియా : చాలామంది పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటారు. కొందరు అయితే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్లినా తోడు- నీడలా వెంట తీసుకెళ్తారు. అలాంటి వాటికి ఏమైనా జరిగితే వారు విలవిల్లాడిపోతారు. సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. సాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ టాలెర్మో అనే మహిళ ఆస్ట్రేలియన్ షెఫర్డ్ డాగ్‌ను పెంచుకుంటోంది. దాని పేరు జాక్సన్‌. గత వారం కిరాణ దుకాణం నుంచి వస్తుండగా ఆ కుక్క కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఎమిలీ తన స్నేహితులతో కలిసి కుక్కను వెతికినా.. ఎంతకీ దాని ఆచూకీ లభించకపోవడంతో కావాలనే ఎవరో దాన్ని అపహరించి ఉంటారని భావించిన మహిళ దాన్ని వెతకడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించింది. 

కుక్కను వెతికి ఇచ్చిన వారికి రూ. 5 లక్షల నజరానాను ప్రకటించింది. అంతేగాక కుక్కను వెతకడానికి సహాయంగా ఓ విమానాన్ని సైతం అద్దెకు తీసుకుంది. విమాన ఖర్చులకు అదనంగా 1200 డాలర్లను కేటాయించింది. జాన్సన్‌ను వెతికి పట్టుకోడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కోసం ఎమిలీ ఒక గోఫండ్‌మేను ప్రారంభించింది.  అందుకు ఆమెకు 7వేల డాలర్ల కంటే ఎక్కువగానే సేకరించడంతో అదనంగా వచ్చిన డబ్బును డాగ్‌ రెస్క్యూకి విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. ఇక ఈ విషయంపై కుక్క యాజమాని ఎమిలీ మాట్లాడుతూ.. ‘జాన్సన్‌  ఎప్పుడూ నాతోనే ఉండేది. మాది నిజమైన ప్రేమ. నేను నా అయిదేళ్ల జాక్సన్‌ను వెతకడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. దాన్ని కనుగొనడానికి నాకు సహాయం కావాల’ని ఆవేదనతో కోరుకుంది. 

మరిన్ని వార్తలు