వైరల్‌ : ప్రాణాలకు తెగించి కోలాను కాపాడింది

21 Nov, 2019 17:59 IST|Sakshi

న్యూసౌత్‌ వేల్స్‌ : ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్‌ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు ఇప్పటికి తగలబడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న అడవిలో మంటల్లో చిక్కుకున్న ఎలుగుబంటి జాతికి చెందిన కోలాను ఒక మహిళ ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.  

కాగా, బుధవారం న్యూ సౌత్‌ వేల్స్‌ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో బారీగా కార్చిచ్చు అంటుకొని 110 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెట్ల పొదళ్లకు కార్చిచ్చు అంటుకోవడంతో కోలా తప్పించుకోవడానికి  ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న టోనీ డోహర్తి అనే మహిళ చెట్ల పొదల్లో చిక్కుకున్న కోలాను చూసి దానిని కాపాడడానికి పరిగెత్తింది. దానిని మంటల నుంచి బయటికి తీసి  తను వేసుకున్న షర్ట్‌ను విప్పి మంటలను అదుపు చేసేందుకు దాని చుట్టూ కప్పి కారు దగ్గరికి తీసుకువచ్చారు.

కోలాకు ఆహారం పెట్టి నొప్పి తెలియకుండా ఉండేందుకు నీరు చల్లారు. తర్వాత దానిని పూర్తిగా బ్లాంకెట్‌తో కప్పి ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న కోలా శరీరం బాగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగానే ఉంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. టోనీ డోహర్తి చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా  ఆమె ఒక యోధురాలు అంటూ ప్రశంసిస్తున్నారు. తనకు ఏమైనా పర్వాలేదు ఎలాగైనా కోలాను కాపాడాలని ఆమె చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు