‘మనసు ద్రవించిపోతోంది.. వారికి థాంక్యూ చెప్పండి’

18 Mar, 2020 20:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్‌.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. తుమ్మినా.. దగ్గినా ఎదుటి వ్యక్తిపై ‘అనుమానాలు’ రేకెత్తేలా చేస్తోంది. సొంత వాళ్లను సైతం దూరంగా ఉంచే పరిస్థితులు తీసుకువస్తోంది. ఎన్నెన్నో హృదయ విదారక దృశ్యాలు, కథనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇలాంటి తరుణంలో కరోనా సోకిన పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు మహమ్మారిని తరిమికొట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే.. తమను తాము కాపాడుకోవడం వారికి సవాలుగా పరిణమిస్తోంది. ఈ క్రమంలో ఈ మహమ్మారి కారణంగా ఫిజీషియన్‌ అయిన తన భర్తను కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వచ్చిందని రేచల్‌ పట్జేర్‌ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో ప్రాణాంతక కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు ప్రతీ ఒక్కరూ కఠినంగా వ్యవహరించి తీరాల్సిందేనని ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. అట్లాంటాకు చెందిన ఆమె సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.(‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’)

‘‘నా భర్త ఎమర్జెన్సీ డిపార్టుమెంటులో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. కరోనా పేషెంట్లకు ఎంతో నిబద్ధతతో సేవలు అందిస్తున్నారు. మాకు ఇదివరకే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు వారాల క్రితం మరో చిన్నారికి జన్మనిచ్చాం. ఇన్ని రోజులు గడుస్తున్నా నా భర్త ఒక్కసారి కూడా పాపాయిని తాకలేదు. ఆయనను మా నుంచి దూరంగా ఉంచేందుకు గ్యారేజ్‌కు పంపించాం. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్లు ఇలాంటి త్యాగాలు చేయక తప్పదు. సమాజం కోసం మేము ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాం. నేను ఇప్పుడు ప్రసూతి సెలవులో ఉన్నాను. అన్నీ నేనే అయి పిల్లలను చూసుకుంటున్నాను.(‘కరోనా’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం!)

కానీ కొన్ని దృశ్యాలు చూస్తుంటే నా మనసు ద్రవించిపోతోంది. రెస్టారెంట్లు, ఇతర చోట్ల ప్రజలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. సోషల్‌ డిస్టాన్సింగ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. నా భర్త లాంటి ఎంతో మంది వైద్యులు, నర్సులు కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తపడండి. మీ సేవలో నిమగ్నమైన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలపండి’’అని రేచల్‌ ప్రజలకు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 8 వేల మంది మరణించగా.. 2 లక్షల మందికి పైగా దీని లక్షణాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న కొంతమంది డాక్టర్లు దీని బారిన పడగా... ఒకరిద్దరు మృతి చెందారు.


  

మరిన్ని వార్తలు