ఈ ‘స్లీపింగ్‌ బ్యూటీ’కి ఎంత ముప్పు!

28 Oct, 2019 20:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లండన్, మాన్‌చెస్టర్‌లోని స్టాక్‌పోర్ట్‌లో నివసిస్తున్న పాతికేళ్ల బెత్‌ గూడియర్‌ నిజంగా ‘స్లీపింగ్‌ బ్యూటీ’. ఆమెను మిత్రులంతా కూడా అలాగే పిలుస్తారు. వాస్తవానికి అది ఆనందించాల్సిన బిరుదు కాదు. ఎందుకంటే ఆమె ‘క్లైన్‌ లెవిన్‌ సిండ్రోమ్‌ (కేఎల్‌ఎస్‌)’ అనే అతి అరుదైన జబ్బుతో బాధ పడుతున్నారు. ఆ జబ్బు కారణంగా రోజుకు 24 గంటల్లో 22 గంటలు నిద్రపోతూనే ఉంటారు. ఎంత ఆపుకుందామన్న ఆగని నిద్ర ఆమెను వెన్నాడుతోనే ఉంటోంది. గత ఎనిమిదేళ్లుగా ఆమె ఈ జబ్బుతో బాధ పడుతూనే ఉంది. ఇంకో చిత్రం ఏమిటంటే గత ఎనిమిదేళ్లుగా తన జీవితంలో ఏం జరిగిందో ఒక్క విషయం కూడా గుర్తులేదట.

స్కూల్‌ రోజుల్లో అన్ని ఆటల్లో చురుగ్గా ఉండే బెత్‌ కాలేజీకి వచ్చాక జిమ్‌లో చేరింది. ప్రపంచంలో అతి తక్కువ మందికి వచ్చే కేఎల్‌ఎస్‌’ ఆమెకు 17వ ఏటనే వచ్చింది. అప్పటి నుంచి ఆమెను ఆమె తల్లే దగ్గరుండి కంటికి రెప్పలా! కాపాడుకుంటోంది. అయినప్పటికీ ఆమె ఇన్నేళ్లు సాధారణ యువతి లాగే జీవితం గడుపుతూ వచ్చింది. మేల్కొని ఉండే సమయంలోనే వెళ్లి తన జిమ్‌ మిత్రులను కలసి వచ్చేది. మిత్రులతో సరదాగా గడుపుతున్నప్పుడే ఆమెకు నిద్ర వస్తే మిత్రులు తీసుకొచ్చి ఇంట్లో దించిపోయేవారు.

ఇటీవలనే అనుకోకుండా ఆమెపై మరో అరుదైన జబ్బు దాడి చేసింది. ‘హైపర్‌ మొబైల్‌ హెహ్లర్స్‌ డన్లోస్‌ సిండ్రోమ్‌ (ఈడీఎస్‌)’ అనే ఆ జబ్బు వల్ల వెన్ను పూస నుంచి మెడ పక్కకు వైదొలుగుతుందట. దాని వల్ల రక్కనాళాలు నొక్కుకు పోయి ప్రాణం పోతుందట. ఈ జబ్బు వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు సార్లు ఆమె బీచ్‌కు వెళ్లి రావడం తప్ప, ఎక్కువగా పడకకే పరిమితం అయింది. కదలడం వల్ల, అటూ ఇటు తిరగడం వల్ల మెడ పక్కకు తొలిగే అవకాశం ఉండడంతో ఎక్కువగా ఆమె రిస్క్‌ తీసుకోవడం లేదు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆమె మెడకు ‘నెక్‌ కాలర్‌’ పెట్టుకొని పోతోంది. సర్జరీ ద్వారా దీన్ని సవరించవచ్చట. మెడ అనేక రక్తనాళాలతో కూడుకున్నదవడం వల్ల లండన్‌లో సర్జరీ చేయడానికి ఏ వైద్యుడు ముందుకు రావడం లేదట. పైగా సర్జరీకి అయ్యే దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వ పింఛను మీద బతికే బెత్‌ తల్లి వద్ద లేవట.

బెత్‌ మంచానికే ఎక్కువ కాలంఅతుక్కు పోవడం వల్ల ఆమె కండరాలు కూడా బాగా బలహీన పడ్డాయి. మరికొంత కాలం ఉపేక్షిస్తే ఆమె మెడ పడిపోయి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని ఆమెను ప్రస్తుతం పరీక్షిస్తున్న వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ జబ్బుకు సర్జరీ చేసే వైద్యులు ఉన్నారని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు కనుగొన్నారు. అయితే అక్కడికి ఎలా వెళ్లాలి ? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ? అన్న ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. అయితే బెత్‌ మిత్రులే ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ పేరిట విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెల్సింది.


మరిన్ని వార్తలు