ఆరు రోజులు లంగ్స్‌ లేకుండానే..!

28 Jan, 2017 13:10 IST|Sakshi
ఆరు రోజులు లంగ్స్‌ లేకుండానే..!

టొరంటో: తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు కెనడా వైద్యులు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్‌ ద్వారా ప్రాణం పోశారు. ఇందుకోసం వారు అవలంభించిన విధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సరైన సమయంలో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడానికి దాతల నుంచి లంగ్స్‌ దొరక్కపోవడంతో సుమారు ఆరు రోజులపాటు ఓ మెషిన్‌ ద్వారానే మహిళకు కృత్రిమ శ్వాస అందించారు. ఇది వైద్య చరిత్రలో చాలా అరుదైన చికిత్సగా.. దీనికి సంబంధించిన వివరాలను టొరంటో జనరల్‌ ఆసుపత్రి వర్గాలు ఇటీవల మీడియాతో వెల్లడించాయి.

సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ మూలంగా మెలిస్సా బినాట్‌(32) అనే మహిళ ఊపిరితిత్తులు చెడిపోయాయి. దీనికి తోడు స్వైన్‌ ఫ్లూ కూడా సోకడంతో ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది. లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడానికి ఆ సమయంలో దాతలు లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఇక ఆమె బ్రతకడం కష్టమే అని వైద్యులు తేల్చేశారు కూడా. అయితే చివరి ప్రయత్నంగా పూర్తిగా పాడైపోయిన ఆమె ఊపిరితిత్తులను తొలగించి.. దాతలు దొరికేవరకు 'నోవాలంగ్‌'గా పిలిచే కృత్రిమ ఊపిరితిత్తుల ద్వారా ఆమెకు శ్వాస అందించారు. ఈ విధానంలో కొద్ది సమయం వరకు పేషెంట్కు శ్వాస అందించడం ఓకేగానీ.. సుమారు ఒక వారం పాటు బినాట్‌ ఈ మెషిన్‌పై ఆధారపడి ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం ఓ దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ఆమెకు అమర్చారు. ప్రస్తుతం బినాట్‌ కోలుకొని తన రెండేళ్ల కూతురు ఒలీవియాతో ఆడుతోంది.

మరిన్ని వార్తలు