వెతికినా దొరకని సోదరి! చివరకు పక్కింట్లోనే 

29 Jun, 2018 20:55 IST|Sakshi

హమ్మయ్య! అక్కయ్య దొరికింది!

తన అక్కకోసం ఏళ్ళ తరబడి వెతికిన యువతికి పక్కింటమ్మాయే తన అక్క అని తెలిస్తే ఎలా ఉంటుంది? ఆ ఆనందానికి హద్దులుండవు కదూ! సరిగ్గా ఇదే అనుభవం హిల్లరీ హారీస్‌ కి ఎదురైంది. హిల్లరీ హారీస్‌ని చిన్నప్పుడే దత్తతకి ఇచ్చేసారు. పెరిగి పెద్దయ్యాక తనకు జన్మనిచ్చిన కుటుంబాన్ని గురించి తెలుసుకోవాలనుకుని ప్రయత్నం మొదలు పెట్టింది. ఏళ్ళతరబడి పరిశోధించినా తన కుటుంబం గురించి వివరాలు దొరకలేదు. తనకో అక్క ఉన్నట్టు, ఆమె పేరు డాన్‌ జాన్సన్‌ అని మాత్రమే తెలుసుకోగలిగింది. అంతకు మించిన వివరాలేవీ లేవు. గూగుల్‌ని అడిగితే చెపుతుందేమోనని ఆ ప్రయత్నం కూడా చేసింది హిల్లరీ హారీస్‌. కానీ డాన్‌ జాన్సన్‌ పేరు కొడితే పుంఖాను పుంఖాలుగా ఫొటోలు వచ్చిపడ్డాయి. వాటిల్లో కొద్దిగా అయినా తన పోలికలతో ఉన్న ఫొటో కోసం వెతికి, విఫలమైంది. ఇక ఇలా కాదనుకొని తన ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకుంది. అయితే గత ఏడాది ఒక రోజు అనూహ్యమైన సంఘటన జరిగింది. పక్కింట్లోకి ఓ జంట కొత్తగా వచ్చింది. ఆమె పేరు డాన్‌.

దత్తత రికార్డులప్రకారం హారీస్‌ అక్క డాన్‌ జాన్సన్‌ నివసించిన విస్కాన్‌సిన్‌లోని గ్రీన్‌ వుడ్‌కి చెందిన వారామె. అందర్నీ తన అక్కగానే పోల్చి చూసుకునే హారీస్‌ డాన్‌ కూడా తన అక్కేనేమో అని భర్తతో పరాచికాలాడింది. కానీ ఆమే నిజంగానే తన అక్క అవుతుందని కలలో కూడా ఊహించలేదు. దానికి తోడు డాన్‌ పూర్తి పేరు తెలియకపోవడంతో ప్రతి రోజూ ఆమెను చూస్తూనే ఉన్నా తను వెతికుతోన్న వ్యక్తి ఆమేనని కనుక్కోలేకపోయింది హారీస్‌. 31 ఏళ్ల హారీస్‌ చొరవైన మనిషి కూడా కాకపోవడంతో పక్కింట్లోకి వచ్చి చేరిన 50 ఏళ్ళ డాన్‌ తో ఎప్పుడూ మాట్లాడింది కూడా లేదు. ఎనిమిది నెలలు అలానే గడిచిపోయాయి. గత ఏడాది ఆగస్టులో పక్కింటి డాన్‌ ఇంటిపై కప్పు పై నుంచి ఓ బ్యానర్‌ని వేళ్ళాడదీసారు. దానిపైన జాన్సన్‌ అనే పేరు వుంది. అంటే డాన్‌ పూర్తిపేరు డాన్‌ జాన్సన్‌. అడాప్షన్‌ రికార్డుల ప్రకారం డాన్‌ జాన్సన్‌ తన అక్క  పూర్తి పేరు.

ఒక్క గెంతు వేసి పక్కింటికెళ్ళి డాన్‌ జాన్సన్‌ని దగ్గరినుంచి పరిశీలనగా చూసింది. అచ్చంగా తన చేతులే. తనలాగే రింగుల జుట్టు. అయినా అడిగితే ఏమనుకుంటారోనని, అడిగే సాహసం చేయలేకపోయింది. ఇంటికెళ్లి డాన్‌ జాన్సన్‌ ఫోన్‌కి మొట్టమొదటిసారి మెసేజ్‌ పెట్టింది. మీ నాన్నగారి పేరేమిటి? ‘‘వీయాన్నే’’అటునుంచి సమాధానం. రిప్లై చూసి తన ప్రయత్నం ఫలించినట్టు అర్థమైంది హారీస్‌కి. డాన్‌ జాన్సన్‌ తన సోదరి. ఇంత కాలంగా తను వెతుకుతోన్న తన అక్క తన పక్కింట్లోనే ఉంది. ఆనందం పొంగిపొర్లింది. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు ఎక్కడెక్కడో పెరిగి చిట్టచివ్వరకు ఒక్కటయ్యారు. ఒకేతండ్రికి పుట్టిన ఇద్దరు యువతుల చెల్లాచెదురైన జీవితాలు చివరకు కలుసుకుని కథ సుఖాంతం అయ్యింది. ఎక్కడెక్కడో తమవారి కోసం వెతుకుతోన్న దత్తత పిల్లలకు హారీస్‌ మీ పక్కింట్లో కూడా వెతకండని ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో సలహాలిస్తోంది. 

మరిన్ని వార్తలు