మహిళకు మైక్రోసాఫ్ట్ నష్టపరిహారం

29 Jun, 2016 21:04 IST|Sakshi
మహిళకు మైక్రోసాఫ్ట్ నష్టపరిహారం

న్యూయార్క్ః సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్లతో ప్రవేశ పెట్టిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.. సంస్థకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. లక్షల మంది యూజర్ల అభిప్రాయాలతో తీర్చి దిద్దామని, అత్యంత సురక్షితమైన వెర్షన్ అంటూ గత యేడాది మార్కెట్లో ప్రవేశ పెట్టిన కంపెనీ.. యూజర్లను అప్ గ్రేడ్ చేసుకోమంటూ తొందర పెట్టడం తలకు చుట్టుకుంది. పాత వెర్షన్ ఓ ఎస్ లను వాడుతున్న వారికి విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమంటూ నోటీసులు పంపించడం చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ మహిళ కోర్టుకెక్కడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

కాలిఫోర్నియా సాసాలిటోకు చెందిన మహిళ టెరీ గోల్డ్ స్టీన్..  మైక్రోసాఫ్ట్ కంపెనీపై పెట్టిన కేసులో విజయం సాధించింది. మైక్రోసాఫ్ట్ తమను విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమని బలవంత పెడుతోందంటూ పెట్టిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్నెల్లలో 30 కోట్లమంది వరకూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకున్నా... అక్కడితో ఆగని మైక్రోసాఫ్ట్.. ఆ సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా పాత ఓ ఎస్ లను వాడుతున్నవారికి నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంస్థ తమను బలవంత పెడుతోందంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేయగా... కొందరు తమ ప్రమేయం లేకుండా విండోస్ 10 ఇన్ స్టాల్ అయిపోతోందంటూ మండిపడ్డారు. అదే ఆరోపణలతో కోర్టు కెక్కిన మహిళ కేసును కోర్టు విచారించింది.  తాజాగా వెలువడ్డ తీర్పులో ఆమెకు మైక్రోసాఫ్ట్ 10 వేల డాలర్డు అంటే సుమారు 7 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది.

కోర్టు తీర్పుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టెరీకి పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న టెరీ.. తన కంప్యూటర్లో విండోస్ 7 తో పనిచేస్తోంది. అయితే ఆమె చేసుకోకుండానే విండోస్ 10 అప్ డేట్ అయిపోవడంతో ఆగ్రహించిన ఆమె మైక్రోసాఫ్ట్ కంపెనీ తీరుపై కోర్టులో కేసు వేసింది. విండోస్ 10 అప్ డేట్ వల్ల కంప్యూటర్ పనిచేయడం మానేసిందని, తన వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని కోర్టుకు విన్నవించింది. అందుకు పరిహారంగా 17 వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసును విచారించిన కోర్టు.. సదరు మహిళకు 10 వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో సంస్థ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు