మగవారికన్నా మహిళలేమి బెటర్‌ కాదు!

19 Aug, 2019 18:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇంట్లో వంటావార్పు చేస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ భర్తకు టిఫిన్‌ పెట్టి, లంచ్‌ బాక్స్‌ సర్ది ఆఫీసుకు పంపించడమే కాకుండా తాను ఓ ఆఫీసుకెళ్లి పనిచేస్తున్న ఆడవాళ్లను అరుదుగానైనా చూస్తూనే ఉన్నాం. అది వారికున్న ప్రత్యేక నైపుణ్యమని, ఏకకాలంలో విభిన్న పనులు చేసే సామర్థ్యం ఆ దేవుడు వారికి ఇచ్చిన వరమంటూ పురుష పుంగవులు ప్రశంసించిన సందర్భాలను వినే ఉంటాం. అయితే అదంతా ఓ ట్రాష్‌ అని ‘ప్లాస్‌ వన్‌’ అనే ఆంగ్ల వెబ్‌సైట్‌ ప్రచురించిన ఓ సర్వే తెలియజేసింది. ఏకకాలంలో అనేక పనులు చేస్తే.. చేసే అసలు పనిపై మగవాళ్లకు దృష్టి తగ్గినట్లే ఆడవాళ్లకు కూడా దృష్టి తగ్గుతుందని, ఏకకాలంలో బహు పనులు చేసే సామర్థ్యం ఆడవాళ్ల మెదళ్లకు లేదని, ఈ విషయంలో ఇరువురి మెదళ్ల మధ్య ఎలాంటి తేడా లేదని సర్వే తేల్చి చెప్పింది. వాస్తవానికి రెండు పనులు, ముఖ్యంగా ఒకే రకమైన పనులు ఏకకాలంలో చేయడానికి మానవ మెదడు పనిచేయదని సర్వే తెలిపింది. అయితే ఒక పని మీది నుంచి మరో పనిపైకి దృష్టిని వేగంగా మళ్లించేందుకు స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా మానవ మెదడు వేగంగా పనిచేస్తుందని కూడా సర్వే కనుక్కొంది.

జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం 43 మంది పురుషులను, అంతే సంఖ్యలో మహిళలను ఎంపిక చేసి వారికి సంఖ్యలు, అంకెలను విశ్లేషించే పరీక్షలు నిర్వహించింది. ఒకే సమయంలో ఒక పనిని, ఒకే సమయంలో రెండు రకాల పనులు అప్పగించి చూశారు. స్త్రీ, పురుషుల మధ్య తేడా లేకుండా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. ఏకకాలంలో ఒక పనిపైనే దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఆ పనికి సంబంధించిన ఫలితాలు బాగున్నాయి. ఏకకాలంలో రెండు పనులు చేసినప్పుడు వాటి ఫలితాల మధ్య తేడాలు కనిపించాయి. ఇంటి పనులు చేయడంలో ఆడవాళ్లదే పైచేయని, మగవారి కంటే ఇంటిని శుభ్రంగా ఉంచే సామర్థ్యం వారికే ఉందన్నది కూడా భ్రమేనని సర్వే తెలిపింది. కాకపోతే ఆడవాళ్లు శుభ్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. మిగతా దేశాల్లో కన్నా ఆస్ట్రేలియాలో మగవాళ్లు వంట కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట. పిల్లల ఆలనాపాలనతోపాటు ఇంటి పనులను ఆడవాళ్లు చూసుకునేలా చేసిందీ మగవాళ్ల ఆధిపత్యమేనని, ఆ సామర్థ్యం వారికే ఉందడనం వారిని మభ్య పెట్టడానికేనని సర్వే తేల్చి చెప్పింది. పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారు.

మరిన్ని వార్తలు