అంగారక గ్రహానికి మహిళా ఆస్ట్రోనాట్స్

16 Jan, 2016 08:32 IST|Sakshi
అంగారక గ్రహానికి మహిళా ఆస్ట్రోనాట్స్

 హూస్టన్: విశ్వంలో సుదూరతీరానున్న అంగారక గ్రహాన్ని అందుకోవాలని, దానిపై అడుగు పెట్టాలన్నది ప్రస్తుతం ఓ అందమైన కల. ఈ కలను సాకారం చేసేందుకు నాసాతోపాటు స్పేస్ ఎక్స్ లాంటి ప్రై వేటు అంతరిక్ష సంస్థలు, రష్యా, చైనా, యూరప్‌లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రోబోటిక్ యంత్రాలను అక్కడికి పంపించిన నాసా, అక్కడికి హ్యోమగాములను పంపించాలనే ప్రయత్నాల్లో అందరికన్నా ముందుంది. అందుకోసం మగ హ్యోమగాములతోపాటు నలుగురు మెరికల్లాంటి మహిళా హ్యోమగాములకు కఠోర శిక్షణ ఇస్తోంది.

 ధూళి దుమారాలను, గడ్డకట్టుకుపోయే చలివాతావరణాన్ని, క్యాన్సర్‌కు దారితీసే రేడియోషన్‌ను తట్టుకోవడానికి వీలుగా నికోల్ ఔనపు మన్, అన్నే మ్యాక్లేన్ (36), జెస్సికా మియర్ (38), క్రిస్టినా హమ్మాక్ కోక్ (37)లు శిక్షణ పొందుతున్నారు. మొదటిసారి వారి శిక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నాసా అధికారులు మీడియాను అనుమతించింది. ర్యాకెట్‌లో అంగారక గ్రహానికి వెళ్లే హ్యోమగాముల్లో యాభై శాతం మహిళలు ఉంటారని తెలుస్తోంది. అందుకు తామెంతా ఎంపికవుతామన్న ధీమాతో ఉన్నారు ఈ నలుగురు మహిళలు.

 ‘నేను హ్యోమగామి శిక్షణకు ఎంపికైనట్లు ఫోన్ రావడం నాకిప్పటికీ గుర్తుంది. అప్పుడు ఉద్రేకంతో శ్వాసకూడా సరిగ్గా తీసుకోలేకపోయాను. నోటి నుంచి మాటరాలేదు. ఉద్వేగంతో ఏడ్చాను’ ఇరాక్‌లో 15 నెలలపాటు హెలికాప్టర్లను నడిపిన మ్యాక్లెయిన్ తన గురించి చెప్పారు. ఓ లక్ష్యం కోసమే సైన్యంలో చేరినా తాను వ్యోమగామి అవడమే తన గమ్యం అనుకున్నానని అన్నారు. ఈ సంఘర్షణల ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనలు ఓ కొత్త ఆశను కల్పిస్తాయన్నది తన ఉద్దేశమన కూడా ఆమె చెప్పారు. మారుమూల మెయినే పట్టణంలో పుట్టి పెరిగిన జెస్సికా మెయిర్ సుదూర ప్రాంతాల్లో పర్యటించడమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.ఇక క్రిస్టినా మాట్లాడుతూ  తాను హ్యోమగామి కావాలన్నది తన లక్ష్యమని, అందుకే యుక్త వయస్సులోనే నాసాలో చేరానని చెప్పారు. నికోల్ మాట్లాడుతూ జీవితంలో ఏమీ కావాలన్నది స్పష్టంగా ఎరుగని దాన్నని, హ్యోమగామిని అవుతానని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. అయితే కాలిఫోర్నియాకు చెందిన తాను మెరైన్ సైన్యం తరఫున ఇరాక్‌లో యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉండడంతో నాసాకు దరఖాస్తు చేసుకున్నానని వివరించారు.

 సాధ్యమైనంత త్వరగా అంగారక యాత్రకు తరలిపోవాలని ఆశిస్తున్నామని ఈ నలుగురు మహిళలు మీడియాకు తెలిపారు. కుటుంబానికి దూరంగా ఉండబోతున్నామన్న అవేదన తప్ప తమకు ఎలాంటి ఆందోళన లేదని వారన్నారు. సుదూరంలో ఉన్న అంగారక గ్రహానికి చేరుకునేందుకు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. రానున్న 15 ఏళ్లలోగా ఈ అందమైన కలను సాకారం చేయాలన్నది తమ లక్ష్యమని నాసా చెబుతోంది.

మరిన్ని వార్తలు