ఇంట్లో 140 పాములు.. మెడకు చుట్టుకుని..

2 Nov, 2019 10:21 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఇంట్లో పాములను పెంచుతున్న ఓ మహిళ జీవితం విషాదాంతమైంది. తాను ప్రేమగా పెంచుకున్న కొండచిలువ మెడకు చుట్టుకోవడంతో ఆమె దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. లారా హర్ట్‌(36) అనే మహిళ  ఇండియానాలోని ఆక్స్‌ఫర్‌‍్డలో నివసిస్తోంది. పాములంటే మక్కువ కలిగిన లారా తన ఇంట్లో ఏకంగా 140 పాములను పెంచుకుంటోంది. వీటిలో ఎనిమిది అడుగుల కొండచిలువ కూడా ఉంది. కాగా బుధవారం లారా ఆకస్మికంగా మృతి చెందినట్లు పొరుగింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారా ఇంటికి వచ్చి ఆమె శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారా ఇంటిని వెదకగా వందల సంఖ్యలో పాములు వాళ్ల కంటపడ్డాయి.

ఈ విషయం గురించి లారా పొరుగింటి వారిని ఆరాతీయగా... అవన్నీ ఆమె పెంపుడు జంతువులు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదికలో బలంగా గొంతు నులిమిన కారణంగానే ఆమె మరణించినట్లు వెల్లడి కావడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు. ఈ క్రమంలో కొండచిలువే ఆమె మరణానికి కారణమని తేలింది. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం నివేదిక తమను ఆశ్చర్యానికి గురి చేసిందని.... పాములు పెంచుకున్న లారా జీవితం విషాదంగా ముగిసిందని పేర్కొన్నారు. ఇక విష రహిత పాములైన కొండచిలువలు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో ఎక్కువగా నివసిస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 రకాల జాతుల కొండచిలువలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు