మహిళలు.. ఆ ఐదు విజయాలు

19 Jan, 2018 18:48 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : వైద్య, విద్యా రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన హక్కులు లభిస్తున్నాయి. కానీ ఆర్థిక స్వాలంబన, రాజకీయ రంగంలో సమాన అవకాశాలు ఇప్పుడప్పుడే లభించేలా లేవు. ‘ఆటంకాలను అధిగమించి మహిళలు సాధికారత సాధించేందుకు ఇంకో వందేళ్లయినా పడుతుంద’ని ప్రపంచ ఆర్థిక సం‍స్థ సైతం పేర్కొంది. ఈ క్రమంలో మహిళా హక్కుల రక్షణ అంశంపై వాషింగ్టన్‌లో జరిగిన చరిత్రాత్మక సదస్సు ‘వుమెన్స్‌ మార్చ్‌’ .. అతివలకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. సాధికారత సాధన కోసం ఆ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలు కాలక్రమంలో చట్టాలుగా మారిన తీరు ఎంతైన అభినందనీయం. అలా 2018లో ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు లభించిన ఐదు ప్రధాన విజయాలను(హక్కులను) ఓసారి పరిశీలిస్తే..

ఐస్‌లాండ్‌లో సమాన వేతనం..
జాతి, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన వేతనాలు కల్పించే చట్టాన్ని తెచ్చింది ఐస్‌లాండ్‌ ప్రభుత్వం. ఈ చట్టం ద్వారా మహిళలకు కూడా పురుషులతో సమాన వేతనాలు కల్పించాలి. దేశంలో గల 1200 కంపెనీలు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందే. పనిచేసే వారి సంఖ్య 25 మం‍ది కంటే ఎక్కువ ఉన్న కంపెనీలు కచ్చితంగా తాము అనుసరిస్తున్న వేతన ప్రమాణాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే. ఏడాది మొదటి రోజు నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది.

సౌదీలో మహిళలకు డ్రైవింగ్‌ అవకాశం
కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో గత దశాబ్ద కాలంగా చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. సౌదీ స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌లో ఎగ్జిక్యూటివ్‌లుగా, షౌరా కౌన్సిల్‌( సౌదీ కన్సల్టేటివ్‌ అసెంబ్లీ) మెంబర్లుగా నియమితులవుతున్న మహిళలకు కొత్తగా డ్రైవింగ్‌ చేసే హక్కును కల్పించింది ఈ రాచరిక ప్రభుత్వం. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ హక్కు కల్పించినా జూన్‌ నుంచి అమల్లోకి రానుంది. కానీ ఇక్కడ కూడా మెలిక పెట్టింది. ఇస్లామిక్‌ చట్టాలకనుగుణంగానే డ్రైవ్‌ చేయాలి.

‘మీ టు’ ఉద్యమ వెల్లువ
స్త్రీ కార్చే ఒక్క కన్నీటి చుక్క చాలు సామ్రాజ్యాలు కూలిపోవడానికి అని పురాణాలు చెబుతున్నాయి. కానీ నేటి ఆధునిక సమాజంలో నీటి చుక్క కార్చటం కాదు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పటం ద్వారా ఎంతటివారినైనా నిగ్గదీయవచ్చని నిరూపించింది.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ ’ఉద్యమం. లైంగిక వేధింపులకు గురైన ఎంతో మంది ఆడవాళ్లు నిర్భయంగా వాటి గురించి చర్చించారు. చట్టానికెవరూ అతీతులు కాదు అని నిరూపించింది హాలీవుడ్‌ నిర్మాత హార్వీ విన్‌స్టన్‌ ఉదంతం. ‘మా శరీరం మాకే సొంతం.. ఎవరికీ అంటే ఇంకెవరికీ కాదు’ అనే నినాదంతో, #బ్యాలన్స్‌టాన్‌పోర్క్‌(ఔట్‌ యువర్‌ పి‌గ్‌) అనే హాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ చేస్తున్నారు మహిళలు.

బాలికా వధువులకు రక్షణ కల్పించిన భారత్‌..
సనాతన దేశంగా చెప్పుకునే భారత్‌లోనూ మహిళలు, ముఖ్యంగా బాలికల హక్కులపై న్యాయస్థానాలు గొప్పతీర్పులు ఇచ్చాయి. మైనర్‌ భార్యతో కాపురం చేయటాన్ని (ఆమె అనుమతి ఉన్నా లేకున్నా) రేప్‌గా పరిగణిస్తామంటూ గత అక్టోబర్‌లో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం నేరం నిరూపితమైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

రాజకీయాల్లో క్రియాశీలకంగా అమెరికా అతివలు..
అగ్రదేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2018 చివరినాటికి పదవులు చేపట్టే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘ద సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ వుమెన్‌ అండ్‌ పాలిటిక్స్‌’ తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ నుంచి 49 మంది, రిపబ్లికన్‌ పార్టీ నుంచి 28 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో రాణిస్తోన్న అగ్రదేశ మహిళలు మిగతా ప్రపంచానికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా