ఆమె చేసిన పనితో గుండెలు గుభేల్; వైరల్‌

3 Jun, 2018 09:31 IST|Sakshi

లాస్‌ఏంజెల్స్‌: ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సిన విమానం ఒక్కసారిగా రద్దీ రోడ్డు మీదికి దూసుకొచ్చేసరికి జనం భీతిల్లిపోయారు. రోడ్డు నిండా కార్లు.. ఇరువైపులా కరెంటు తీగలు.. ఏ కొంచెం అటుఇటైనా పర్యవసానం తీవ్రంగా ఉండేది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పినా ఆ పైలట్‌ చేసిన పనికి వాహనదారుల గుండెలు గుభేల్‌మన్నాయి. అమెరికాలో అత్యంత జనసమ్మర్థం గల రెండో అతిపెద్ద నగరం లాస్‌ఏంజెల్స్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియోలూ వైరల్‌ అయ్యాయి.

అరుదైన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌: సెస్నా 172 రకానికి చెందిన తేలికపాటి విమానం జాన్‌ వెయిన్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ తీసుకున్న కొద్ది సేపటికే ఇంజన్‌లో లోపం తలెత్తింది. ఎయిర్‌పోర్టుకు తిరిగెళదామని పైలట్‌ అనుకునేలోపే మొత్తానికే పనిచేయడం ఆగిపోయింది. క్రాష్‌ ల్యాండింగ్‌ తప్పదనుకున్నా.. చివరి ప్రయత్నంగా హంటింగ్టన్‌ బీచ్‌ రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించిందామె. వెంట్రుకవాసిలో కార్లను, కరెంటు తీగల్ని దాటుకుంటూ మొత్తానికి సురక్షితంగా ల్యాండ్‌ అయింది. విమానంలో మహిళా పైలట్‌ ఒక్కరే ఉన్నారని, ఈ ఘటనలో రోడ్డుపై ఉన్నవారిలో ఏ ఒక్కరూ గాయపడలేదని, విమాన సర్వీసులకు కూడా ఆటంకం కలుగలేదని ఎల్‌ఏపీడీ, ఏవియేషన్‌ అధికారులు తెలిపారు. అయితే జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండైన హంటిగ్టన్‌ రోడ్డును కొద్ది గంటలపాటు మూసేశారు. ఇది అత్యంత అరుదైన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అని, పైలట్‌ అద్భుతం సృష్టించారని కొందరు ఏవియేషన్‌ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ మహిళా పైలట్‌ ఎవరన్న విషయాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. ఆమె ఆరెంజ్‌ కంట్రీ ఫ్లైట్‌ క్లబ్‌లో శిక్షణ పొందుతున్నారని, సదరు విమానం జేజీ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌ సంస్థకు చెందినదని తెలిసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు