-

సౌదీలో ఇంతే...

27 Sep, 2017 17:43 IST|Sakshi

యూఏఈ: మహిళలపై ఎన్నో ఆంక్షలు, పరిమితులున్న సౌదీ అరేబియాలో ఎట్టకేలకు మహిళల డ్రైవింగ్‌కు రాచరిక ప్రభుత్వం అనుమతించింది. వచ్చే ఏడాది జూన్‌ నుంచి అమలయ్యే ఈ నిర్ణయానికి సంబంధించి విధివిధానాలను నూతనంగా ఏర్పాటైన కమిటీ 30 రోజుల్లో నిర్ధేశిస్తుంది.తాజా నిర్ణయంతో సౌదీ మహిళలు ఇక తమ భర్తలు లేదా సంరక్షకుల అనుమతి లేకుండానే తాము సొంతంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి పోరాటాలతో సౌదీ మహిళలు ఈ సౌలభ్యాన్ని సాధించుకున్నా ఇంకా పలు మౌలిక అంశాల్లో వారు భర్తలు, తండ్రులు, సంరక్షకుల అనుమతిపై ఆధారపడే దుస్థితి కొనసాగుతోంది.సౌదీలో దశాబ్ధాల తరబడి సమాజంలో మహిళల పాత్ర పరిమితంగానే ఉంది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వెలువరించిన 2016 ప్రపంచ లింగ అసమానతల నివేదికలో 144 దేశాల జాబితాలో సౌదీ అరేబియా చిట్టచివరన 141వ స్థానంలో నిలిచింది. సౌదీ తర్వాత కేవలం సిరియా, పాకిస్తాన​, యెమెన్‌ దేశాలున్నాయి.


పురుషుల కనుసన్నల్లోనే...
వివాహం, విడాకులు, ప్రయాణం, బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, ఉద్యోగం..ఇలాంటి అంశాలేవైనా పురుష సంరక్షకుల అనుమతి లేకుండా సౌదీ మహిళలు చేసేదేమీ లేదు. మహిళలు తమ జీవితంలోని ప్రతి అంకంలోనూ, అడుగడుగునా పురుషుల కనుసన్నల్లోనే కదలాలని అక్కడి గార్డియన్‌షిప్‌ చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.మహిళల తండ్రులు మరణించిన సందర్భాల్లో వారి భర్త, పురుష బంధువు, సోదరులు, చివరికి కుమారుడో వారికి చిన్న చిన్న విషయాల్లోనూ అనుమతి ఇవ్వాల్సిందే. భర్తతో విడాకులు పొందితే మగపిల్లలకు ఏడు, ఆడపిల్లలకు తొమ్మిదేళ్లు వస్తేనే మహిళలు తమ పిల్లలను తమ వద్ద ఉంచుకోగలుగుతారు. మగవారి అనుమతితోనే జాతీయ గుర్తింపు కార్డు లేదా పాస్‌పోర్ట్‌ పొందాలి. ఫ్యామిలీ సెక్షన్‌లేని రెస్టారెంట్‌లో మహిళలు తినడానికి వీల్లేదు.


మగవారితో దూరం..దూరం
సమాజంలో ‍స్ర్తీ,పురుషులు భాగమే అయినా సౌదీలో మాత్రం మగువలు మగవారి కంటపడటం అరుదు. కేవలం ఆస్పత్రులు, బ్యాంకులు, వైద్య కళాశాలల్లో
మాత్రం దీనికి కొంత మినహాయింపు ఉంటుంది. స్ర్తీ, పురుషులు కలిసి పనిచేయడాన్ని నివారించేందుకు 2013లో సౌదీ అధికారులు పలు నిబంధనలు
విధించారు. వారు పనిచేసే షాపులు, సంస్థల్లో అడ్డుగోడలు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు.బహిరంగ ప్రదేశాల్లో శరీరాన్ని పూర్తిగా కప్పే వస్ర్తాలు ధరించాల్సిందే.


అనుమతిస్తేనే వ్యాపారం
సౌదీలో మహిళలు వ్యాపారం చేయాలంటే సాహసమే. వారు సొం‍తం వ్యాపారానికి మొగ్గుచూపితే వారి వ్యక్తిత్వం పట్ల కనీసం ఇద్దరు మగాళ్లు సంతృప్తి వ్యక్తం
చేయాలి.అప్పుడు మాత్రమే వారికి వ్యాపారం చేసేందుకు లైసెన్స్‌ కానీ, రుణం కానీ మంజూరు చేస్తారు.


న్యాయస్ధానాల్లోనూ అన్యాయమే
సౌదీ చట్టాల ప్రకారం ఒక పురుషుడు ఇద్దరు మహిళలతో సమానం. మహిళ మైనర్‌తో సమానం.సౌదీ నిబంధనల మేరకు మహిళకు తన సొంత జీవితంపై తనకుండేది కేవలం పరిమిత అధికారాలే. ఆస్తిపాస్తుల్లోనూ అక్కడి మహిళలకు దక్కేది అరకొరే. సోదరుడు పొందే వాటాలో సగ భాగం మాత్రమే మహిళకు దక్కుతుంది.మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల అరాచకంతో మహిళలు పేదరికంలోకి నెట్టబడే దుస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు