సమానత్వానికి మరో 200 ఏళ్లు

7 Jan, 2019 03:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తేల్చి చెప్పిన ప్రపంచ ఆర్థిక సంస్థ

మానవుడు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా లింగ వివక్షత మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో లింగ భేదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థికం, రాజకీయం, ఉద్యోగం ఇలా దాదాపు అన్ని రంగాల్లో ఇంకా మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ లింగ వివక్షతను దాటి స్త్రీపురుష సమానత్వం సాధించడానికి ఇంకా 200 ఏళ్లు పడుతుందట. అంతర్జాతీయంగా అధ్యయనం చేసి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం తేల్చిన సత్యమిది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం 2018 భారత్‌లో స్త్రీపురుష సమానత్వానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పింది. దేశంలోని ఆర్థిక రంగంలో ఉన్న లింగ అసమానతలను పరిష్కరించుకోవాల్సిన తక్షణ ఆవశ్యకతను అది నొక్కి చెప్పింది. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నాలుగు కీలకాంశాల ఆధారంగా లింగపరమైన ఆర్థిక అసమానతలను అంచనా వేసింది. ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య రంగాల్లో స్త్రీపురుష అంతరాలను కొలమానంగా తీసుకుని మన దేశంలో కొనసాగుతున్న అసమానతలపై దృష్టి సారించాలని చెప్పింది. గత దశాబ్దకాలంగా ఆరోగ్యం విషయంలో ప్రపంచంలోనే మన దేశం చివరి నుంచి మూడోస్థానంలో ఉండటం ప్రమాదానికి సంకేతంగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం భావించింది. స్త్రీపురుషుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగడానికి రెండు శతాబ్దాల కాలం పడుతుందని స్పష్టం చేసింది.

అమెరికా కన్నా బెటర్‌...

రాజకీయ సాధికారతలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 54వ స్థానంలో ఉన్న అమెరికా, 33వ స్థానంలో ఉన్న యుకె కన్నా మెరుగైన ఫలితాలను కనబర్చి మన దేశ మహిళలు ప్రపంచంలోనే 15వ స్థానంలో నిలిచినట్లు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం రిపోర్టు వెల్లడించింది. పది ప్రధాన ప్రమాణాలను గమనిస్తే.. బంగ్లాదేశ్, శ్రీలంకతో పోలిస్తే మన దేశం లింగ అసమానతలను జయించాలంటే చాలా విషయాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. 100 ప్రధాన కంపెనీల్లో కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే కీలక స్థానాల్లో ఉన్నారు. అలాగే అతి కొద్ది మందికి మాత్రమే నూతన కంపెనీల స్థాపనకు ఆర్థిక తోడ్పాటునిచ్చినట్లు తేలింది. 

నిర్వహణ రంగం స్త్రీ భాగస్వామ్యం

-   ముంబై స్టాక్‌ ఎక్చేంజీలోని టాప్‌ 100 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న మహిళలు 2018 జనవరి నాటికి ఐదుగురు మాత్రమే. అలాగే 2019 జనవరి నాటికి ఇందులో ఎలాంటి మార్పు లేదు. 
-   ముంబై స్టాక్‌ ఎక్సేంజీలోని టాప్‌ 500 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న స్త్రీలు 2018 జనవరి నాటికి 18 మంది కాగా, 2019 జనవరి నాటికి 25 మందికి చేరారు. 
-   ముంబై స్టాక్‌ ఎక్చేంజీలోని టాప్‌ 100 కంపెనీల్లో బోర్డు సభ్యులుగా ఉన్న మహిళలు 2018 నాటికి 172 మంది ఉండగా, 2019 జనవరి నాటికి 180 మందికి చేరారు. 
-   టాప్‌ 482 కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మహిళలు 2018 నాటికి 14.08 శాతం ఉండగా, 2019 జనవరి నాటికి 14.49 శాతానికి పెరిగింది. 

మెరుగ్గా ఐస్‌లాండ్‌...

ప్రపంచ దేశాల్లో ఐస్‌లాండ్‌ గత పదేళ్లుగా మహిళా సాధికారతలో మెరుగ్గా ఉంది. మహిళా శాసనకర్తలు, సీనియర్‌ అధికారులు, మేనేజర్లు మాత్రం ఐస్‌లాండ్‌లో గతంకన్నా కొద్దిగా తగ్గినప్పటికీ.. మిగిలిన దేశాలకన్నా అసమానతలు ఈ దేశంలో తక్కువగా ఉన్నట్లు తేలింది. గత అక్టోబర్‌లో ఐస్‌లాండ్‌ ప్రధాని కత్రిన్‌ జాకోబ్స్‌డాటిర్‌తో సహా ఐలాండ్‌ మహిళలంతా వేతనాల్లో అసమానత్వానికి, లైంగిక వేధింపులకు నిరసనగా పనిమానేసి వీ«ధుల్లోకొచ్చిన విషయం తెలిసిందే. 

 ఇటీవల విడుదల చేసిన గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ ఆధారంగా రాజకీయాలు, పనిలో భాగస్వామ్యం, ఆరోగ్యం, విద్యారంగాల్లో అంతరాలను అధిగమించడంలో ప్రపంచవ్యాప్తంగా 0.1 శాతం మెరుగుదల సాధించాం. ఈ లెక్కన సమానతకు ప్రపంచం చాలా దూరంలో ఉంది. స్త్రీ పురుష సమానత్వం కోసం ఇంకా 202 ఏళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ ప్రయాస అని యుఎన్‌ ఉమన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ అన్నా కరీన్‌ జాట్‌ఫోర్స్‌ వ్యాఖ్యానించారు. సమాన వేతన విధానాలు, మహిళల అవసరాలకు తగినట్లుగా గర్భిణులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అవకాశాలు కల్పించడం, ప్రసవానంతరం మహిళలకు చట్టబద్ధమైన ఉద్యోగ భరోసా ఇవ్వడం ద్వారా స్త్రీ పురుషుల ఆర్థిక అంతరాలను కొంతవరకైనా తగ్గించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

200 ఏళ్లు ఆగాల్సిందే..
జెనీవాకు చెందిన అంతర్జాతీయ సంస్థ 149 దేశాల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత తదితర రంగాల్లో కొనసాగుతున్న అసమానతలను రికార్డు చేసింది. ఈ యేడాది విద్య, ఆరోగ్యం, రాజకీయ భాగస్వామ్యంలో ఉన్న అంతరాలను ప్రపంచ ఆర్థిక సంస్థ వెల్లడించింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ నైపుణ్యం తదితర విషయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది. పశ్చిమ యూరప్‌ దేశాలు మరో ఆరు దశాబ్దాల్లో ఆర్థిక అంతరాలను అధిగమిస్తారని, మిడిల్‌ ఈస్ట్, నార్త్‌ ఆఫ్రికాలో లింగ వివక్షను అధిగమించేందుకు మరో 153 ఏళ్లు వేచిచూడాల్సిందేనని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య అసమానతలు పూడ్చటానికి కనీసం 202 ఏళ్లు పడుతుందని ఫోరం అంచనా వేసింది.


మరిన్ని వార్తలు