అతివ.. ఆకాశ మార్గాన!

9 Mar, 2019 02:47 IST|Sakshi

అంతరిక్షంలో చరిత్ర సృష్టించనున్న మహిళలు

ఈ నెల 29న పూర్తిగా ఇద్దరు అతివలతో స్పేస్‌వాక్‌

నిప్పులు చిమ్ముతూ నింగికెగసి వినీలాకాశంలో చక్కర్లు కొడుతున్న వ్యోమనౌకను వీడి ఇద్దరు మహిళలు ఈ నెల 29న స్పేస్‌వాక్‌ చేయబోతున్నారు. మెక్‌ క్లెయిన్, క్రిస్టినా కోచ్‌లు భూమికి దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో నడిచి కేవలం మహిళలు పాల్గొన్న తొలి స్పేస్‌వాక్‌గా రికార్డు సృష్టించబోతున్నారు. మెక్‌ క్లెయిన్, క్రిస్టినా కోచ్‌ల స్పేస్‌వాక్‌కు భూమిపై నుంచి మరో మహిళ సాయం చేయబోతున్నారు. మేరీ లారెన్స్‌ లీడ్‌ ఫ్లైట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తే, జాకీ కేగీ స్పేస్‌వాక్‌ ఫ్లైట్‌ కంట్రోలర్‌గా ఉంటారు. మెక్‌ క్లెయిన్‌ అమెరికా సైన్యంలో మేజర్, పైలట్‌ కూడా. ఈమె ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ క్రిస్టినా కోచ్‌ మార్చి 14న అంతరిక్ష నౌకలో వెళ్లి మెక్‌ క్లెయిన్‌ను కలుసుకుంటారు.

స్పేస్‌ వాక్‌కు ఎలా వెళ్తారు?
అంతరిక్ష నౌక నుంచి బయటకు రావడాన్నే స్పేస్‌ వాక్‌ అంటారు. బయటకు రావాలంటే వారి రక్షణకోసం స్పేస్‌ సూట్‌ ధరిస్తారు. స్పేస్‌ సూట్‌లో వారు శ్వాస పీల్చుకోవడానికి ఆక్సిజన్, తాగేందుకు నీళ్లూ ఉంటాయి. స్పేస్‌ వాక్‌కు కొన్ని గంటల ముందే స్పేస్‌ సూట్‌ను ఆక్సిజన్‌తో నింపి దాన్ని ధరిస్తారు. ఒకసారి దాన్ని ధరించాక కొన్ని గంటలపాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని పీల్చవచ్చు. ఆ తర్వాత వ్యోమగామి శరీరం నుంచి నైట్రోజన్‌ను పూర్తిగా తొలగిస్తారు. ఒకవేళ నైట్రోజన్‌ను బయటకు పంపకపోతే స్పేస్‌ వాక్‌ చేస్తున్నప్పుడు వారి శరీరం నిండా బొబ్బలు వచ్చి, ఈ బొబ్బల కారణంగా వ్యోమగాముల భుజాలదగ్గరా, మోచేతులపైనా, ముంజేతులపై, మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో వ్యోమగాములు పరిస్థితి అత్యంత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. 

అరుదైన.. అద్భుతమైన..
మెక్‌క్లెయిన్, క్రిస్టినా కోచ్‌ ఇద్దరూ మార్చి 29న చేసే అరుదైన స్పేస్‌వాక్‌ మహిళలందరికీ గర్వించదగిన సందర్భంగా మారబోతోంది. ఇప్పటి వరకు ఇద్దరు పురుషులో, లేదా ఒక పురుషుడి తోడుగానో మరో మహిళ స్పేస్‌ వాక్‌లో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు కేవలం ఇద్దరూ మహిళలే ఆ సాహసాన్ని అవలీలగా ఆవిష్కరించబోతున్నారు. 

మరిన్ని వార్తలు