మనిషిని చంపిన రోబో..

19 Feb, 2016 16:19 IST|Sakshi
మనిషిని చంపిన రోబో..

సుఖమయ జీవితం కోసం మానవుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక సౌకర్యాలను సృష్టించుకుంటున్నాడు. శారీరక శ్రమకు సెలవిచ్చి.. సృజనాత్మకతకు పదునుపెట్టి టెక్నాలజీని రోజుకో కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అసాధ్యమనుకున్న అనేక అద్భుతాలను సుసాధ్యం చేసి రాబోయే తరాలకు కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగులో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో చూపించినట్టుగా భూగర్భ నగరాలను నిర్మించడం, మందు బిళ్లల్నే భోజనంగా తీసుకోవడం.. వంటివెన్నో రాబోయే రోజుల్లో నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఆ విశేషాలేమిటో చూద్దామా..!

భవిష్యత్ సిత్రాలు..
వచ్చే వందేళ్లలో ప్రపంచంలో ఎతైన ఆకాశహార్మ్యాలు, అండర్ వాటర్ నగరాలు, భూగర్భంలో 25 అంతస్తుల లోతైన భవనాలు, త్రీడీ పరిజ్ఞానంతో ముద్రించే ఇళ్లు.. ఇలా  అనేక అద్భుతాలు సాధ్యమవబోతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచంలో చోటుచేసుకోబోయే మార్పుల గురించి తెలుసుకోవడానికి మొబైల్  ఫోన్ల తయారీ సంస్థ సామ్‌సంగ్, స్మార్ట్‌థింగ్స్ కంపెనీలు సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని చేపట్టాయి. విద్యావేత్తలు, భవిష్యత్తు పరిశోధకులు, వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ అధ్యాపకులు ఈ అధ్యయన బృందంలో సభ్యులుగా ఉన్నారు.

ఇప్పుడిప్పుడే మొదలవుతున్న డ్రోన్‌లు భవిష్యత్తులో బైక్‌ల మాదిరి అందుబాటులోకి వస్తాయని ఈ అధ్యయనం చెప్తోంది. త్రీడీ టెక్నాలజీని ఉపయోగించి కేవలం కొద్ది రోజుల్లోనే అందమైన  ఇళ్ల నిర్మాణం సులువవనుంది. ఇప్పటికే సాధ్యమైన త్రీడీ ఆహారం భవిష్యత్తులో మరింత స్మార్ట్‌నెస్‌ను సంతరించుకొని, మనకు నచ్చిన చెఫ్‌ల వంటకాలను మన ఇంట్లోనే ఉన్న కంప్యూటర్ ప్రింటర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకుని హాయిగా తినవచ్చు. గోడలు మన మూడ్‌కి అనుగుణంగా రంగులు మారుస్తుంటాయి. మరో వందేళ్లలో ఇలాంటి ఊహకందని అనేక అద్భుతాలను చూడబోతున్నామని ఈ అధ్యయనంలో పాల్గొన్న అంతరిక్ష శాస్త్రవేత్త డా.మాగీ అడెరిన్ పోకాక్ తెలిపారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలను ఏర్పరచుకుంటామని, వాణిజ్య అవసరాల కోసం అంతరిక్షంలోకి పంపుతున్న రాకెట్‌లను రాబోయే రోజుల్లో ఇప్పటి విమానాల మాదిరిగా ఉపయోగిస్తామని పరిశోధకులు తెలిపారు.

పొంచి ఉన్న ముప్పు..
ఇలాంటి ఊహకందని టెక్నాలజీలో భాగంగా మనిషి తాను చేసే ప్రతి పనికి ప్రత్యామ్నాయంగా రోబోలను తయారు చేస్తున్నాడు. మరి రోబో సినిమాలో చూపించినట్టు ఈ రోబోలు భవిష్యత్‌లో వినాశకారిగా మారితే పరిస్థితి ఏంటి..?

మనిషిని చంపిన రోబో..
రోబో చేతిలో మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం మనదేశంలో తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ఇటీవలే జరిగింది. గుర్గావ్‌లోని మానేసర్ ఎస్‌కేహెచ్ మెటల్స్ కంపెనీలో 63 మంది కార్మికులు, 34 రోబోలు పనిచేస్తున్నాయి. ఒక రోబో చేతిలో 24 ఏళ్ల రామ్‌జీ లాల్ నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

ఎలా జరిగింది..?
ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగ్రాం చేసిన రోబో అది. బరువైన మెటల్ షీట్లను ఎత్తుతుంది. రోబో ఎత్తిన షీట్ ఒకవైపు ఒరిగి ఉండటాన్ని గమనించిన రామ్ జీ లాల్ ఆ షీట్ కింద పడితే డేమేజ్ జరుగుతుందని భావించి దాన్ని సరిచేసేందుకు ముందుకు వె ళ్లాడు. అంతే రోబో అతణ్ని కూడా మెటల్‌గా భావించి నలిపేసింది. అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు.

ఇలాంటివే..
2014 జూన్ 29న జర్మనీలోని వోక్స్‌వేగన్ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఒక లోహపు ప్లేటుకు అదిమి గుండెలపై నొక్కి చంపేసింది. 1979లో మిచిగాన్ ఫోర్టు కర్మాగారంలోనూ లైన్‌వర్కర్‌ను రోబో పొట్టనబెట్టుకుంది. 1984లో జపాన్‌లో ఇంజనీర్ కెంజి ఉరాడాను రోబో చంపేసింది. కాబట్టి నాణేనికి బొమ్మాబొరుసూ ఉన్నట్టే.. టెక్నాలజీకి కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి.

మరిన్ని వార్తలు