ఆస్ట్రేలియా పౌరసత్వం ఇక కష్టమే

21 Apr, 2017 00:34 IST|Sakshi
ఆస్ట్రేలియా పౌరసత్వం ఇక కష్టమే

కనీసం నాలుగేళ్లు ఉన్నవారికే...
నిబంధనలను కఠినతరం చేసిన ఆస్ట్రేలియా
ఇప్పటిదాకా ఎన్నిసార్లయినా పరీక్ష రాయొచ్చు
ఇక మూడుసార్లే అవకాశం

మెల్‌బోర్న్‌: భారతీయులు అత్యధికంగా వినియోగించే వర్క్‌ వీసాను  రద్దుచేసిన ఆస్ట్రేలియా...పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తాజా నిబంధనల ప్రకారం పౌరసత్వం పొందాలంటే ఆంగ్లంపై పట్టు కలిగిఉండడంతోపాటు సుదీర్ఘకాల నివాసం ఉండాలి. కనీసం నాలుగేళ్లు ఇక్కడ నివసించడంతోపాటు ఆస్ట్రేలియా విలువలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒక వ్యక్తి పౌరసత్వ పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరుకావొచ్చు. అయితే తాజా సవరణల ప్రకారం మూడుసార్లు మాత్రమే పరీక్షకు హాజరుకావొచ్చు.

మూడోసారి కూడా పరీక్షలో అర్హత సాధించలేకపోతే ఆ తర్వాత రెండేళ్లపాటు పౌరసత్వం పొందేందుకు వీలుకాదు. పరీక్షలో మోసగించేందుకు యత్నించినవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతోపాటు స్వతంత్ర ఆంగ్ల పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది.మహిళలు, బాలలకు ఎటువంటి గౌరవం ఇవ్వాలనే దానిపైనే ఇందులో ప్రధాన ప్రశ్నలు ఉంటాయి. ఇంకా బాల్యవివాహాలు, గృహహింస తదితరాలకు సంబంధించిన ప్రశ్నలిచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై ప్రధానమంత్రి మాల్కం టర్న్‌బుల్‌ మాట్లాడుతూ తమ దేశ విలువలను దరఖాస్తుదారుడు ఏమేరకు అర్థం చేసుకున్నాడు?వాటికి  ఏవిధంగా కట్టుబడి ఉంటాడు? అనేదానిపైనా ప్రశ్నలు ఉంటాయన్నారు.

వీటిన్నిటితోపాటు పౌరసత్వ పరీక్ష సమయంలో మోసగించేందుకు యత్నించేవారిని ఆటోమేటిక్‌గా ఫెయిల్‌ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. విలువలకు కట్టుబడేవారికి, కష్టపడే స్వభావం కలిగినవారికే పౌరసత్వం ఇస్తామన్నారు. ‘పౌరసత్వం అనేది దేశ ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. అందువల్ల పౌరసత్వ కార్యక్రమమనేది జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి’ అని అన్నారు. కాగా ఇప్పటిదాకా కనీసం 12 నెలలు నివసించినవారు పౌరసత్వం పొందవచ్చు. అయితే ఇకనుంచి అలా కుదరదు. కనీసం నాలుగు సంవత్సరాలు ఇక్కడ నివసించినవారు మాత్రమే పౌరసత్వ పరీక్షకు అర్హులు. 

మరిన్ని వార్తలు