'భారత్‌తో బాగుంటుంది.. మంచి విషయం కూడా'

11 Jan, 2018 09:27 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పట్ల తన సానుకూలతను వ్యక్తం చేశారు. భారత్‌లాంటి దేశాలతో కలిసి పనిచేయడం చాలా హాయిగా ఉంటుందని, అది చాలా మంచి విషయం అని అన్నారు. మాస్కోతో వాషింగ్టన్‌ సంబంధాలను మెరుగుపరుచుకుంటుందా అనే అంశంపై మీడియా ఆయనను ప్రశ్నించగా 'భారత్‌, రష్యా, చైనావంటి దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, కలిసి పనిచేయడం బాగుంటుంది. అది చాలా మంచి అంశం కూడా' అని ఆయన బదులిచ్చారు. అదే సమయంలో ఉత్తర కొరియా విషయంలో మాత్రం ఆయన మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ దేశంతో కలిసి పనిచేయడం తన సమస్య కాదని, ఎప్పటి నుంచో ఆ దేశానికి ఉన్న సమస్య అని, అదే ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక తన చేతిలో ఓడిపోయిన హిల్లరీ గురించి స్పందిస్తూ దేశంలో బలమైన సైనిక శక్తికి ఆమె తగినవారు కాదని అన్నారు. అయితే, ఆమె ఇతర అంశాల్లో మాత్రం మంచి సామర్థ్యం ఉందన్నారు. ఇక దక్షిణ కొరియా విషయంపై స్పందిస్తూ 'నేను ఈ రోజు ఉదయాన్నే అధ్యక్షుడు మూన్‌తో మాట్లాడాను. ఇది చాలా అంశాల్లో మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం.. ఏం జరుగుతుందో' అని ట్రంప్‌ అన్నారు.

మరిన్ని వార్తలు