భార్యాభర్తలు ఎక్కువ టైం పనిచేస్తే తిప్పలేనట!

13 Jan, 2016 20:07 IST|Sakshi
భార్యాభర్తలు ఎక్కువ టైం పనిచేస్తే తిప్పలేనట!

ఉద్యోగం చేసే భార్యాభర్తలు దీర్ఘకాలం పనిచేస్తే వారి మధ్య సంబంధాలు అంత మెరుగ్గా ఉండవట. దంపతుల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతలు క్రమేపీ తగ్గుతాయని జీవితం యాంత్రికంగా మారుతుందని ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. సర్వే వివరాలను ఫోర్బ్స్ రిపోర్ట్ చేసింది. ఆరు నెలలపాటు ఉద్యోగాలు చేస్తున్న 285 మంది జంటలపై సర్వే నిర్వహించారు. పని గంటలు మరీ ఎక్కువయ్యే కొద్ది ఆయా ఉద్యోగుల ఎనర్జీ బాగా తగ్గిపోయి, ఆ తర్వాత భాగస్వామితో సమయాన్ని వెచ్చించలేకపోతున్నామని ఒప్పుకున్నారు. ఉదయం లేవడంతోనే ఉరుకులు పరుగులతో వారు తమ రోజులు నెట్టుకొట్టుస్తున్నామని, కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు తమ గోడు వెల్లబోసుకున్నారట.

రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములతో హాయిగా సమయాన్ని గడపలేకపోతున్నట్లు వారు కూడా గుర్తించినా ఏం చేయలేకపోతున్నారు. అలా కాకుండా భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను(సంతోషం, బాధ మొదలైనవి) షేర్ చేసుకుంటుంటే వారి మధ్య అన్యోన్యత, ప్రేమ పెరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయట. దీర్ఘకాలిక ఆఫీస్ టైమింగ్స్, వ్యాపారం కోసం ఎక్కువగా టైం కేటాయించడంతో ఏర్పడిన టెన్షన్, ఒత్తిడి మన నుంచి కాస్తయిన తొలగిపోయి రిలాక్స్ అవుతారు. రెండు సగం గ్లాసులు కలిస్తేనే పూర్తి గ్లాస్ నిండుతుందిగానీ, రెండు అర్ధసగాలు విడివిడిగా ఉన్నంతకాలం జీవితం కూడా సగంగానే మిగిలిపోతుందట. లక్ష్యాలు, సంపాదన అంటూ ఎన్నో ఉన్నప్పటికీ వాటిని రోజులో కాస్త సమయమైనా మూలన పడేయాలని సర్వే వివరాలను గమనిస్తే తెలిసిపోతుంది.

మరిన్ని వార్తలు