ఆ మ్యాజిక్‌ ఏంటో అందరూ తెలుసుకోవాలి!

23 Apr, 2020 18:09 IST|Sakshi

జీవితంలో ప్రతీ ఒక్కరు తమకంటూ కొంతమంది ఆత్మీయులను సంపాదించుకుంటారు. బాధ కలిగినా.. సంతోషంతో మనసు ఉప్పొంగినా ఆ భావాలను వారితో పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరి వాళ్లమనే భావన కలుగుతుంది. అలాంటి సమయాల్లో నచ్చిన పుస్తకం తీసి చదువుతూ ఉంటే మనసు తేలికపడుతుంది. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు... మానసికంగా ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ‘చినిగిన చొక్కైనా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు... ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని ప్రజాకవి కాళోజీ అన్నారంటే మనిషి జీవితంలో పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా  స్వీయ అనుభవంతోనే మనకు దాని విలువ బోధపడుతుంది. నేడు(ఏప్రిల్‌ 23) అంతర్జాతీయ పుస్తక దినోత్సవం. 

జగమెరిగిన ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్‌ పియర్‌ జయంతి- వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా 1995 నుంచి ప్రతీ ఏటా వరల్డ్‌ బుక్‌ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘‘ప్రపంచమంతా కోవిడ్‌-19తో కల్లోలం అవుతున్న వేళ పుస్తకాలు చేసే మ్యాజిక్‌ ఏంటో మనం తెలుసుకోవాలి. పుస్తక పఠనానికి ఉన్న శక్తి ఏమిటో... సరికొత్త రేపటిని నిర్మించుకోవడంలో అది ఏవిధంగా ఉపయోగపడుతుందో నేర్చుకోవాలి’’’ అని యునెస్కో ట్వీట్‌ చేసింది. మంచి పుస్తకాన్ని మించిన ఆత్మీయులెవరూ ఉండరంటూ ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సైతం.. ‘‘ నన్ను నేను సౌకర్యంగా ఉంచుకోవడంలో పుస్తకాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయాల్లో.. ఐసోలేషన్‌లో బుక్స్‌ మనకు ఎంతో సహాయం చేస్తాయి. పుస్తక పఠనంలో ద్వారా వచ్చే శక్తిని ఈ వరల్డ్‌బుక్‌డే సందర్భంగా మనం సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అని ట్వీట్‌ చేశారు.

తాటాకుల నుంచి ఇ-బుక్‌ల వరకు
ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పుస్తకాల ముద్రణ సులువుగా మారింది.. ఇ- బుక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సౌకర్యాలేవీ లేని పురాతన కాలం నుంచే ఎంతో మంది రచయితలు, కవులు తాటి ఆకులపై రచనా వ్యాసంగాలు చేశారు. ఇక సాహిత్యానికి పెద్దపీట వేసిన శ్రీకృష్ణదేవరాయలు వంటి ఎంతో మంది రాజులు కవులను ప్రోత్సహిస్తూ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి భవిష్యత్‌ తరాలకు విలువైన సంపదను అందించారు. ఇక ప్రస్తుతం లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటూ ప్రపంచంపై కరాళ నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి పోతులూరి వీరేంద్ర బ్రహ్మేంద్రస్వామి ఏనాడో తాళపత్ర గ్రంథాల్లో లిఖించారన్న విషయం సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. 


పన్నెండేళ్ల వయస్సులో లైబ్రరీ స్థాపించిన చిన్నారి యశోద

గొప్ప కానుక...
ప్రస్తుతం ప్రాణాంతక కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ఎంతో మంది పుస్తక పఠనంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళకు చెందిన యశోద డి షెనాయ్ వంటి(12) చిన్నారులు సైతం ఖాళీ సమయాన్ని మరిన్ని ఎక్కువ పుస్తకాలు చదివేందుకు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరొందిన కేరళలో.. లాక్‌డౌన్‌ నిబంధనలు పాక్షికంగా సడలించిన నేపథ్యంలో నిత్యావసరాల షాపులతో పాటుగా పుస్తకాల షాపులు కూడా తెరవాలని ఆ రాష్ట్ర వాసులు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు విజ్ఞప్తి చేశారు. మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుస్తకాలను కొనుక్కునేందుకు కొన్ని గంటల పాటు బుక్‌షాపులు తెరచి ఉంచాలని కోరుతున్నారు.  ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పుస్తకాల షాపులకు మినహాయింపు ఇవ్వడంతో రీడర్స్‌ క్లబ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్‌ బుక్‌ డే రోజు తమకు అందిన గొప్ప కానుక అంటూ  పుస్తక ప్రియులు మురిసిపోతున్నారు.

మరిన్ని వార్తలు