అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం

24 Apr, 2020 14:44 IST|Sakshi
పాత చిత్రం

బీజింగ్‌: ప్రపంచ దేశాలు కోవిడ్‌-19 నివారణ చర్యలతో తీరికలేకుండా ఉన్న వేళ వైరస్ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంపై పట్టుసాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌ మలేషియా, బ్రూనైతో ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతంలో డ్రాగన్‌ దేశం పట్టు పెంచుకుంటోందని పాంపియో పేర్కొన్నారు.
(చదవండి: భారతీయులకు కోవిడ్‌-19ను ఎదుర్కొనే సామర్థ్యం అధికం..)

కరోనా పరిస్థితులపై ఆగ్నేయాసియా దేశాల మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాంపియో ఈ ఆరోపణలు చేశారు. వివాదంలో ఉన్న ప్రాంతంలో మిలటరీ బలగాలు, యుద్ధ నౌకలను మోహరించి చైనా పొరుగు దేశాలను భయపెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. తద్వారా  చమురు, సహజయవాయువు ప్రాజెక్టుల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. కాగా, పాంపియో ఆరోపణల నేపథ్యంలో యూఎస్‌ యుద్ధనౌక దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్‌ జలసంధి గుండా నిఘా పెట్టింది.

మరోవైపు దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న దీవులు, దిబ్బల లెక్క తీస్తున్నామని చైనా తమ చర్యను సమర్థించుకుంది. కాగా, దక్షిణ చైనా సముద్రంలో దాదాపు ఎవరూ నివసించని దీవుల సముదాయాలు పరాసెల్స్, స్ప్రాట్లిస్‌ దీవులపై సార్వభౌమాధికారం ఎవరిదనే విషయంలో చైనా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నెలకొంది. ఈ రెండు సముదాయాల్లోని అత్యధిక భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. దీనిపై తమకు వందల ఏళ్లుగా హక్కులు ఉన్నాయని చెబుతోంది.
(చదవండి: క‌రోనా: అదిరింద‌య్యా ఐడియా)

మరిన్ని వార్తలు