రోగి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ!

19 Feb, 2016 21:46 IST|Sakshi
రోగి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ!

ఫ్రాన్స్ వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని తొలగించేందుకు 3డీ వర్చువల్ గ్లాసెస్ వినియోగించి.. రోగి  స్పృహలో ఉండగానే శస్త్ర చికిత్స నిర్వహించారు. కృత్రిమ ప్రపంచాన్ని రోగికి చూపుతూ.. ఆపరేషన్ సమయంలో మెదడులోని భాగాలను సులభంగా పరీక్షించేందుకు అనుమతించే త్రీడీ అద్దాలను వినియోగించారు.  

రోగి స్పృహలో ఉన్నపుడే శస్త్ర చికిత్స నిర్వహించడంలో భాగంగా వైద్యులు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని ఏంజిర్ ఆస్పత్రిలో నిర్వహించిన చికిత్స విజయవంతమవ్వడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ సమయంలో రోగి కళ్లముందు కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించేందుకు త్రీడీ గ్లాస్ లు వాడినట్లు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మెదడు పని తీరును ప్రత్యక్షంగా గుర్తించగలిగినట్లు ఏంజెర్స్ ఆస్పత్రి న్యూరో సర్జన్ ఫిలిప్పీ మెనీ తెలిపారు. కణతి కారణంగా రోగి ఇప్పటికే ఓ కన్ను కోల్పోయాడని,  అందుకే దృష్టిని రక్షించేందుకు ప్రత్యేకంగా వినియోగించే ఈ కొత్త టెక్నాలజీని అతడి ఆపరేషన్ కు  వాడినట్లు వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి క్రమంగా కోలుకుంటున్నాడని, కీమో థెరపీ చేయించుకునే ప్రయత్నంలో కూడ ఉన్నాడని చెప్తున్నారు.  

స్పృహలో ఉండగా రోగికి ఆపరేషన్ చేయడం అనేది సుమారు పదేళ్లుగా జరుగుతోందని, అయితే వర్చువల్ రియాలిటీ అద్దాల వాడకం శస్త్ర చికిత్స సమయంలో వాడటం ఇదే మొదటిసారి అని డాక్టర్ మెనీ తెలిపారు. ఇలా చేయడంవల్ల రోగికి సంబంధించిన మాట, దృష్టి, కదలికలు చికిత్స సమయంలో స్పష్టంగా  తెలుసుకోగలిగే అవకాశం ఉందంటున్నారు. పేషెంట్ కు ప్రత్యేక అనుభూతిని కల్గించడంకోసం కాదని, శస్త్ర చికిత్స సులభమవ్వడంకోసమే ఈ అద్దాలు వాడినట్లు వైద్యులు స్సష్టం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో మెనీ బృందం... భవిష్యత్తులో మెదడు కణతిల ఆపరేషన్ కు ఇదే విధానాన్ని అమల్లోకి తేనున్నారు.  త్వరలో పిల్లల చికిత్సలకు కూడ వచ్చువల్ రియాలిటీ గ్లాసెస్ వినియోగించే యోచనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు