ప్రపంచంపై కరోనా పడగ

13 Mar, 2020 04:52 IST|Sakshi
వైరస్‌ను చంపేందుకు షాంఘైలో బస్సులో ఉంచిన అల్ట్రా వయోలెట్‌ కిరణాల మిషన్లు

115 దేశాల్లో 1.25 లక్షల కేసులు; 4600 మరణాలు

యూరప్‌ దేశాలపై అమెరికా ట్రావెల్‌ బ్యాన్‌

జెనీవా/టెహ్రాన్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్‌ వెలుగు చూసిన చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా.. ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, అమెరికా సహా పలు దేశాల్లో విజృంభిస్తోంది. గురువారానికి ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో ఈ వైరస్‌ బాధితుల సంఖ్య 1,25, 293గా, మరణాలు 4,600గా తేలిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ గణించింది. వీటిలో చైనా వెలుపల నమోదైన కేసులు 44,500 కాగా, మరణాల సంఖ్య 1431. మొత్తం కేసులు, గణాంకాలను పరిశీలిస్తే ఆసియాలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. (కరోనాతో గాయకుడి హనీమూన్ రద్దు!)

ఆసియాలో 90,765 కేసులు నమోదు కాగా, 3,253 మరణాలు సంభవించాయి. యూరప్‌లో 22,969 కేసులు, 947 మరణాలు, మధ్యప్రాచ్యంలో 9,880 కేసులు, 364 మరణాలు, అమెరికా, కెనడాల్లో 1,194 కేసులు, 29 మరణాలు, ఆఫ్రికాలో 130 కేసులు, రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. చైనా తరువాత ఎక్కువగా ఇటలీలో 12,462 కేసులు, 827 మరణాలు, ఇరాన్‌లో 10,075 కేసులు, 429 మరణాలు సంభవించాయి. కోవిడ్‌ –19ను ‘అదుపు చేయదగ్గ విశ్వవ్యాప్త మహమ్మారి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. (భారత్లో తొలి మరణం)

5 బిలియన్‌ డాలర్లివ్వండి
వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, చికిత్స అందించేందుకు 5 బిలియన్‌ డాలర్ల అత్యవసర ఆర్థిక సాయం అందించాలని ఇరాన్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌)ను ఆశ్రయించింది. ఐఎంఎఫ్‌ను ఇరాన్‌ సాయం కోరడం 1962 తరువాత ఇదే ప్రథమం. కరోనా భయంతో  పాఠశాలలకు శ్రీలంక ప్రభుత్వం  సెలవులు ప్రకటించింది.  

యూరప్‌ దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌
కరోనా కల్లోలం నేపథ్యంలో యూకే మినహా ఇతర యూరప్‌ దేశాల నుంచి అమెరికాలోకి ఎవరూ అడుగుపెట్టవద్దని గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి  30 రోజుల పాటు యూకేయేతర యూరప్‌ దేశాల వారిపై ఈ నిషేధం ఉంటుందన్నారు.  వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో యూరోపియన్‌ యూనియన్‌ విఫలమైందని ఆయన విమర్శించారు.  అమెరికా ట్రావెల్‌ బ్యాన్‌పై యూరప్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  మరోవైపు, అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ భారత పర్యటన కూడా రద్దయింది. మార్చి 15, 16 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించాల్సి ఉంది. (మహమ్మారి ముంచేసింది!)

ట్రంప్‌ను కలిసిన వ్యక్తికి కోవిడ్‌–19
బ్రజీలియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కూడా కోవిడ్‌–19 ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. గతవారం ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్‌ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ ఫేబియోకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బొల్సొనారొ గత వారం   ట్రంప్‌తో  భేటీ అయ్యారు.  ఫేబియో, ఇతర అధికార బృందం కూడా ఆ భేటీలో పాల్గొన్నది. అనంతరం ఫేబియోకు కరోనా సోకినట్లు  నిర్ధారణ అయింది.  అయితే, దీనిపై  ఆందోళన చెందడం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. (కాన్స్ ఫెస్టివల్ క్యాన్సిల్ ?)

యూఎస్‌ వర్సిటీలపై కరోనా ఎఫెక్ట్‌
వాషింగ్టన్‌: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని 100కు పైగా విశ్వవిద్యాలయాల్లో తరగతులను రద్దు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు క్లాస్‌లకు ప్రత్యక్షంగా హాజరు కావడాన్ని నిలిపేస్తూ పలు యూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆన్‌లైన్‌ క్లాస్‌లను ప్రోత్సహిస్తున్నాయి. పలు విద్యాలయాలు తమ క్యాంపస్‌ల్లో క్రీడలు సహా బోధనేతర కార్యక్రమాలను రద్దు చేశాయి. (ఇంటి పట్టునే ఉండండి)

మరిన్ని వార్తలు