కోవిడ్‌.. కంగారు వద్దు

5 Mar, 2020 04:50 IST|Sakshi
జమ్మూలోని ఓ పాఠశాలలో మాస్క్‌లు ధరించిన విద్యార్థులు

న్యూఢిల్లీ/జెనీవా: కోవిడ్‌–19 కేసులు భారత్‌లో కూడా ఎక్కువైపోతూ ఉండడంతో అందరిలోనూ కంగారు మొదలైంది . ఏ నలుగురు కలిసినా కరోనా అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ వైరస్‌ సోకితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే చర్చ. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లెక్కలేనన్ని పోస్టులు షేర్‌ అవుతున్నాయి. ఇప్పటికే మనం వైరస్‌లు విసిరిన సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నాం. వాటినుంచి బయటపడ్డాం కూడా. కరోనా వైరస్‌ విస్తరించిన దేశాలు, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కోలుకుంటున్న వారు ఎక్కువగానే ఉన్నారు. కేరళలో మూడు కేసులు నమోదైతే ముగ్గురూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కూడా లెక్కల్ని తీస్తే 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి వైరస్‌ సోకినా ప్రాణాలకొచ్చే ముప్పేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) అధికారులు చెబుతున్నారు. సార్స్, మెర్స్‌ వంటి వైరస్‌లతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య, విస్తరించిన దేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉంది.

80 దాటితే ముప్పు ఎక్కువ
కరోనా వైరస్‌తో వృద్ధులు, రోగనిరోధక శక్తి లేని వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరణాల రేటుని కూడా పరిశీలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారికి వైరస్‌ సోకితే కాస్త ప్రమాదకరమైతే 30 ఏళ్లకు లోబడి ఉన్న వారు అసలు భయపడనక్కర్లేదు.

మరిన్ని వార్తలు