అమెరికాలో అసాధారణం 

1 Apr, 2020 03:35 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలు దాటిన కరోనా బాధితులు

40 వేలు దాటిన మరణాల సంఖ్య

వాషింగ్టన్‌/ప్యారిస్‌/రోమ్‌/మాడ్రిడ్‌: ప్రపంచవ్యాప్తంగా 185 దేశాలు, ప్రాంతాల్లో కోవిడ్‌ కరాళ నృత్యం కొనసాగుతోంది. మంగళవారం నాటికి 40,673 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోగా 8,19,038 మంది వ్యాధి బారినపడ్డారు. అమెరికాలో తీవ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. యుద్ధ సమయాల్లో కనిపించే క్షేత్రస్థాయి ఆసుపత్రులు న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌లో ఏర్పాటయ్యాయి. మన్‌హట్టన్‌ సమీపంలో ఓ యుద్ధ నౌకలో వెయ్యి పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఉపాధి కోల్పోయిన పలువురు నగరంలోని ఫుడ్‌బ్యాంకుల్లో ఆహారం కోసం క్యూ కడుతున్నారు. వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలకు హామీ ఇచ్చినప్పటికీ రానున్న నెల రోజులు అమెరికా అతిపెద్ద సవాలు ఎదుర్కోబోతోందన్న ఆయన హెచ్చరిక అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికాలో 3,400 మంది కోవిడ్‌కు బలికాగా, 1,74,665 మందికి వైరస్‌ సోకింది.

ఖండాలు, ప్రాంతాల వారీగా.. 
యూరప్‌లో మొత్తం 4,29,362 కోవిడ్‌ కేసులు ఉండగా, ఆసియాలో ఈ సంఖ్య 1,08,143గా ఉంది. యూరప్‌లో 27,740 మంది ప్రాణాలు కోల్పోగా ఆసియాలో 3878 మంది బలి అయ్యారు. మధ్యప్రాచ్యంలో కోవిడ్‌ కేసుల సంఖ్య 54,642 కాగా, మరణాలు 2999గా ఉంది. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దీవుల్లో 16,399 కేసులు, 417 మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో 5,343 కేసులు, 170 మరణాలు నమోదయ్యాయి.

శోక సంద్రంలో ఇటలీ: ఆరు కోట్ల జనాభా ఉన్న ఇటలీలో ఇప్పటివరకు 11,591 మంది కోవిడ్‌కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారికి బలైన వారిలో మూడోవంతు మంది ఇటలీలోనే ఉండటం మరో విషాదం. మొత్తం బాధితుల సంఖ్య 1,01,739కు చేరుకుంది. లాక్‌డౌన్‌ను మరో 15 రోజులపాటు పొడిగించాలని నిర్ణయించింది.  స్పెయిన్‌లో కోవిడ్‌ కారణంగా 24 గంటల్లోనే 849 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 8,269కు చేరుకుంది.

చైనా.. ఫ్రాన్స్‌.. జర్మనీ 
చైనాలో తాజాగా 48 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం 81,518 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. సోమవారం ఒకరు మరణించడంతో వైరస్‌ మృతుల సంఖ్య 3,305కు చేరుకుంది. ఫ్రాన్స్‌లో వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 44,550 కాగా, 3,024 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో ఇప్పటి వరకు 682 మంది చనిపోగా 68,180 మందికి వ్యాధి సోకింది.  బ్రిటన్‌లో మంగళవారం ఒక్కరోజే 381 మంది మృతిచెందడంతో కరోనా మరణాల సంఖ్య 1,408కు చేరుకుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక 
ఆసియా ప్రాంత దేశాలకు కోవిడ్‌ ప్రమాదం తప్పినట్లుగా భావించరాదని, వ్యాధి కేంద్రబిందువులుగా యూరప్, అమెరికా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించడం తగదని డబ్ల్యూహెచ్‌వో ఆసియా పసిఫిక్‌ ప్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ తకేషీ కసాయ్‌ హెచ్చరించారు. వైరస్‌పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు