హిరోషిమా బాంబులకన్నా వేడెక్కిన సముద్రాలు

14 Jan, 2020 18:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019లో మానవ జాతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచంలోని సముద్రాలన్నీ వేడెక్కాయని ‘చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’లోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లీజింగ్‌ చెంగ్‌ బందం వెల్లడించింది. ప్రపంచంలోని సముద్రాల సరాసరి ఉష్ణోగ్రత 0.135 ఫారిన్‌హీట్‌లకు పెరిగిందని, ఇది 360 కోట్ల హిరోషిమా బాంబు పేలుళ్ల నుంచి వెలువడే వేడికి సమానమైనదని ఆయన పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల్లోనే సముద్ర జలాల వేడి బాగా పెరిగిందని, భూతాపోన్నతికి ఇది మరో ఉదాహరణని ఆయన తెలిపారు.

లీజింగ్‌ చెంగ్‌తో పాటు ఈ బందంలో చైనా, అమెరికాలకు చెందిన 11 సంస్థల పరిశోధకులు పాల్గొన్నారు. ప్రపంచ సముద్రాల్లోకెల్లా అట్లాంటిక్, దక్షిణ సముద్రాలు బాగా వేడెక్కాయని, సముద్రం ఉపరితలంపైనే కాకుండా ఉపరితలానికి 6,500 అడుగుల లోతులో కూడా సముద్ర జలాలు వేడెక్కాయని ఆయన చెప్పారు. 1955 నుంచి 1986 మధ్య కాలంలో పెరిగిన సముద్ర జలాల వేడితో పోలిస్తే 1987 నుంచి 2019 మధ్య 450 శాతం వేడి పెరిగిందని ఆయన తెలిపారు. భూతాపోన్నతిలో 96 శాతం వేడిని సముద్రాలే పీల్చీసుకుంటాయని, నాలుగు శాతం మాత్రమే జంతుజాలం నివసించే భూమి వాతావరణంలో కలుస్తుందని, అందుకు వేడికి తనలో కలిపేసుకునే గుణం సముద్రాలకు ఉండడమేనని ఆయన చెప్పారు. అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో భూతాపోన్నతి ఎక్కువగా పెరుగుతోందని ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలో అడవులు, పొదలు తగులబడడానికి కారణం కూడా భూతాపోన్నతి పెరగడమే కారణమని భావిస్తున్న విషయం తెల్సిందే.

ఇలాగే సముద్ర జలాలు వేడెక్కుతూ పోతే 2300 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు నాలుగు అడుగులు పెరుగుతాయని పరిశోధకులు ఇదివరకే అంచనా వేశారు. తద్వారా అనేక భూభాగాలు నీట మునుగుతాయని, ఆ విపత్తును నివారించడానికి భూతాపోన్నతికి కారణం అవుతున్న ఉద్ఘారాలు తగ్గించాలని పలు ప్రపంచ సదస్సులు తీర్మానించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లే దు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు