సోమాలియాలో ఉగ్ర బీభత్సం

16 Oct, 2017 08:47 IST|Sakshi

రాజధాని మొగదిషులో బాంబు పేలి 231 మంది మృతి

పేలుడులో 275 మందికి గాయాలు

ఇది అల్‌కాయిదా అనుబంధ అల్‌ షబాబ్‌ ఉగ్ర సంస్థ పనే: సోమాలియా

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం రాత్రి(భారత కాలమానం)అత్యంత శక్తిమంతమైన బాంబు పేలడంతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 275 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్రికా కొమ్ముగా పేరుపడ్డ సోమాలియాలో ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మొగదిషులో రద్దీగా ఉన్న మార్కెట్‌ను కుదిపేసిన ఈ పేలుడులో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

పేలుడు తీవ్రతకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అనేక మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. పలువురు క్షతగాత్రుల శరీర భాగాలు తెగిపడగా వారిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇంతవరకూ ప్రభుత్వం తరఫున అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటించలేదు. ఈ దాడిని జాతీయ విపత్తుగా పేర్కొన్న సోమాలియా ప్రభుత్వం ఇది అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌
షబాబ్‌ పనేనని ఆరోపించింది.

సోమాలియా అధ్యక్షుడు మొహమద్‌ అబ్దుల్లాహీ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు.ఒక పక్క రక్తమోడుతున్నా తమవారి కోసం పలువురు భవనాల శిథిలాల కింద వెదకడం ప్రమాదస్థలం వద్ద భీతావహ పరిస్థితికి అద్దం పట్టింది. ప్రమాదం జరిగినప్పటి నుంచీ నగరం అంబులెన్స్‌ల సైరన్లతో మార్మోగింది. ‘మా పదేళ్ల అనుభవంలో ఇలాంటి భయంకర దాడిని చూడలేదు’ అని ఆమిన్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ట్వీట్‌ చేసింది.

శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
పేలుడు తీవ్రతకు సోమాలియా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఉన్న సఫారీ హోటల్‌ కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఆదివారం తెల్లవారుజాము వరకూ ఫ్లాష్‌ లైట్ల వెలుగులో తీవ్రంగా శ్రమించారు. ప్రజలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆస్పత్రులు ఇచ్చిన పిలుపుకు వేలాదిమంది స్పందించారు. ‘ఒక పక్క మృతదేహాలు, మరొపక్క క్షతగాత్రులతో ఆస్పత్రి మొత్తం నిండిపోయింది. శరీర భాగాలు తెగిపడ్డ వారిని కొన ప్రాణాలతో ఆస్పత్రి తీసుకొస్తున్నారు’ అని స్థానిక ఆస్పత్రి డైరెక్టర్‌ మొహమద్‌ యూసుఫ్‌ చెప్పారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాధారణ పౌరుల్ని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని సోమాలియా సమాచార శాఖ మంత్రి అబ్దిరహమాన్‌ ఒమర్‌ పేర్కొన్నారు. ‘ఈ రోజు దుర్దినం. వారెంతో క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించారు. ఉగ్రవాదులపై పోరుకు మనమంతా ఏకం కావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు